‘వాడిని కానీ జైల్లో పెడితే సగం పోలీస్ డిపార్ట్‌మెంట్ జైల్లోకెళ్తుంది’

SMTV Desk 2019-04-09 11:43:16  RGV, ram Gopal Varma,

‘వాడిని కానీ జైల్లో పెడితే సగం పోలీస్ డిపార్ట్‌మెంట్ జైల్లోకెళ్తుంది’ అనే క్యాప్షన్‌తో ‘కోబ్రా’ సినిమా పోస్టర్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. అయితే న్యూస్ ఏంటీ అని అనుకోవచ్చు. ఇందులో వివాదాల దర్శకుడు రాంగోపాల్ వర్మ నటించకపోతే ఇది న్యూసు కాకుండా పోయేది. ఆయన నటిస్తున్నారు కాబట్టే ఈ కోబ్రా చాలా ప్రత్యేకతను సంతరించుకుంది. ఆయన పుట్టినరోజు సందర్భంగా ఉదయం తాను నటించే కొత్త అవతారం ఎత్తుతున్నట్టు ప్రకటించిన విషయం తెలిసిందే. ఓ చేతిలో గన్ను, మరో చేతిలో సిగరెట్, కళ్లకు నల్లని కళ్లద్దాలతో సీరియస్ లుక్‌లో వున్నాడు వర్మ. ఇది పక్కా గ్యాంగ్‌స్టర్స్ సినిమా మాదిరే వుందని అంటున్నారు. ఇది ఓ పేరుమోపిన ప్రమాదకర నేరస్థుడి బయోపిక్ అని పోస్టర్‌లో తెలిపారు. కానీ, ఎవరిదో చెప్పలేదు. కోబ్రా పోస్టర్ పైన ఆయన పేరుతో పాటు అగస్త్య మంజు, కీరవాణి, నిర్మాత డిపిఆర్ పేర్లు వున్నాయి. తాను తొలిసారి తెరమీద నటిస్తున్నానని వర్మ ట్వీట్ చేశాడు.

ఇన్ని రోజులు దర్శకుడిగా, నిర్మాతగా, గాయకుడిగా ఇలా నానా రూపాల్లో తెరవెనుక తన పాత్ర పోషించిన వర్మ ఇప్పుడు నటించడానికి పూనుకున్నాడు. ‘మాకేం ఖర్మరా నాయనా’ అని ఆయన అభిమానులు ఆయన స్టైల్లోనే మెచ్చుకుంటున్నారు. గన్‌షాట్‌ ఫిల్మ్స్‌ సంస్థ ఈ సినిమాను నిర్మించబోతోంది. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలను ప్రకటిస్తామని నిర్మాతలు పేర్కొన్నారు. చూడాలిమరి వర్మ తన నటనతో ఎంత సంచలనం సృష్టిస్తాడోనని కామెంట్లు చేస్తున్నారు. తన పుట్టినరోజు సందర్భంగా వర్మ ఓ ట్వీట్‌ చేశాడు. ‘నా వయసు మరో సంవత్సరం పెరిగింది’ అంటూ ఏడుస్తున్న ఎమోజీని పోస్ట్‌ చేశాడు.