ఇన్సూరెన్స్ పాలసీ తీసుకున్న వారికి గుడ్ న్యూస్

SMTV Desk 2019-04-09 11:26:43  insurance policy, insurance policy claims

ఇన్సూరెన్స్ పాలసీ తీసుకున్న వారికి ఇన్సూరెన్స్ రెగ్యులేటర్ ఐఆర్‌డీఏఐ ఓ శుభవార్త తెలిపింది. త్వరలో పాలసీ క్లెయిమ్ మొత్తాన్ని విడతల వారీగా (ఇన్‌స్టాల్‌మెంట్స్) తీసుకునేందుకు పాలసీదారులకు ఓ కొత్త ఆప్షన్ అందుబాటులోకి రానుంది. పర్సనల్ యాక్సిడెంట్, హెల్త్ ఇన్సూరెన్స్ వంటి పాలసీలకు త్వరలో ఈ ప్రయోజనం అందుబాటులోకి వచ్చే అవకాశముంది. పాలసీ క్లెయిమ్ మొత్తాన్ని విడతల వారీగా అందుకునే సదుపాయానికి సంబంధించి ఐఆర్‌డీఏఐ ఇప్పటికే ఒక ప్యానెల్‌ను ఏర్పాటు చేసింది. ఇది ఈ ఏడాది జనవరిలోనే తన నివేదికను ఐఆర్‌డీఏఐకు అందించింది. ఇప్పుడు ఐఆర్‌డీఏఐ ముసాయిదా మార్గదర్శకాలను విడుదల చేసింది. పరిశ్రమ వర్గాలు, ప్రజల నుంచి సూచనలు కోరుతోంది. ఏప్రిల్ 17 వరకు అభిప్రాయాలు తెలియజేయవచ్చు. ఇన్సూరెన్స్ పాలసీ మొత్తం విడతల వారీగా తీసుకునే వెసులుబాటు అందుబాటులోకి వస్తే పాలసీదారులకు లేదా నామినీకి కొంత కాలంపాటు స్థిర ఆదాయం లభిస్తుంది. ఐఆర్‌డీఏఐ ముసాయిదా ప్రకారం పాలసీదారుడు క్లెయిమ్ సెటిల్‌మెంట్‌కు సంబంధించి తన నిర్ణయాన్ని తెలియజేయాల్సి ఉంటుంది. ఒకేసారి క్లెయిమ్ మొత్తం తీసుకుంటారా, లేక విడతల వారీగా మొత్తాన్ని అందుకుంటారా అనే ఆప్షన్ ఎంచుకోవాలి. లేకపోతే రెండింటిని కూడా ఎంచుకునే సౌకర్యం ఉంది. ఇన్సూరెన్స్ కంపెనీలు పాలసీని విక్రయించేటప్పుడు పాలసీదారులకు ఈ ఆప్షన్‌ను అందుబాటులో ఉంచాలి. ఒకవేళ కొనుగోలు చేసే సమయంలో ఆప్షన్ ఎంచుకోకపోతే తర్వాతనైనా ఈ సౌకర్యాన్ని వారికి కల్పించాలి. ఒకేసారి సెటిల్‌మెంట్, విడతలవారీ సెటిల్‌మెంట్‌కు పాలసీ ప్రీమియం ఒకేలా ఉండాలి.