నాటి ప్రభుత్వాలకు సర్జికల్ దాడులు చేయాలనిపించలేదు....!!!!

SMTV Desk 2019-04-09 11:23:17  narendra modi, bjp, loksabha elections, indian governments, congtress, surgical strikes

సుందర్‌గఢ్: దేశాన్ని గతంలో పాలించిన ప్రభుత్వాలకు ఏనాడు సర్జికల్ దాడులు జరపాలని ఆలోచనరాలేదు. విమానంలో సరిహద్దులు దాటి శత్రువుపై దాడి చేసి చంపే ధైర్యం నాటి ప్రభుత్వాలకు లేదు అని ప్రధాని నరేంద్ర మోదీ ఎద్దేవా చేశారు. ఎన్నికల సందర్భంగా సుందర్‌గఢ్‌లో నిర్వహించిన ప్రచారసభలో ఆయన మాట్లాడుతూ....పాకిస్థాన్‌లో ఉగ్రవాద సురక్షిత స్థావరాల్ని నాశనం చేసేందుకు చౌకీదార్ ధైర్యాన్ని ప్రదర్శిస్తే, సాయుధ దళాల అధికారాల్ని కాంగ్రెస్ నీరుకార్చే ప్రయత్నం చేస్తోందని విమర్శించారు. తను దేశానికి చౌకీదారునని, దాని ప్రయోజనాల్ని కాపాడేందుకే పనిచేస్తున్నానని అని చెప్పుకొచ్చారు. ఉగ్రవాదులు, మావోయిస్టులకు ఆశ్రయమిచ్చిన వారిని కాపాడేందుకు కాంగ్రెస్ ప్రయత్నిస్తోందని ఆరోపించారు. ప్రజల అభివృద్ధికి కట్టుబడి పనిచేసే నిజాయితీ, క్రమశిక్షణకల ప్రభుత్వం కావాలా లేక అవినీతి, అరాచకత్వానికి పేరుగన్నది కావాలా అన్నది ప్రజలే నిర్ణయించుకోవాలని ప్రధాని చెప్పారు. ‘ఈసారి ఒడిశాలో కమలం వికసిస్తుంది. బిజెపి విజయాన్ని చవిచూస్తుంది. సాధ్యమైనన్ని కమలాలు ఈ రాష్ట్రంలో వికసిస్తాయని నేను నమ్మకంగా చెప్పగలను’ అని ప్రధాని విశ్వాసం వ్యక్తం చేశారు. అదేవిధంగా దేశ భద్రతను కాపాడేందుకు, వేగంగా అభివృద్ధి సాధించేందుకు బలమైన నిర్ణయాత్మకమైన ప్రభుత్వం కావాలి కనుక కేంద్రంలో బిజెపి తిరిగి అధికారంలోకి వస్తుందన్న ఆశాభావాన్ని మోడీ వ్యక్తం చేశారు. బిజెపి మాత్రమే పటిష్టమైన, సుస్థిరమైన ప్రభుత్వాన్ని అందించగలదన్నారు.