హైదరాబాద్‌ నగరవాసులకు శుభవార్త

SMTV Desk 2019-04-09 11:14:42  Hyderabad, GHMC, Good news

హైదరాబాద్‌ నగరవాసులకు జీహెచ్‌ఎంసీ ఒక శుభవార్త ప్రకటించింది. 2019-20 ఆర్ధిక సంవత్సరానికి ముందుగా ఆస్తిపన్ను చెల్లించేవారికి ఎర్లీ బర్డ్ పధకం కింద 5 శాతం రాయితీ ఇస్తామని జీహెచ్‌ఎంసీ కమీషనర్ ఎం.దానకిశోర్‌ తెలిపారు. కనుక జీహెచ్‌ఎంసీ పరిధిలో నివసిస్తున్నవారు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని కోరారు. నేటి నుంచి ఈ నెల 30వ తేదీ వరకు మాత్రమే ఈ అవకాశం ఉంటుందని తెలిపారు. ఈ-సేవా, మీ-సేవా, జీహెచ్‌ఎంసీ సిటిజన్ సర్వీస్ సెంటర్లలో, ఎంపిక చేసిన బ్యాంకులలో లేదా ఆన్‌లైన్‌లో ముందస్తు పన్ను చెల్లించి 5 శాతం రాయితీ పొందవచ్చునని తెలిపారు. అయితే పాత బకాయిలున్నవారికి ఈ పధకం వర్తించదని తెలిపారు.

మొదటిసారిగా 2012–13 ఆర్థిక సంవత్సరంలో ప్రవేశపెట్టిన ఈ ఎర్లీబర్డ్‌ పథకానికి నగరవాసుల నుంచి మంచి స్పందన వస్తుండటంతో జీహెచ్‌ఎంసీ దీనిని ప్రతీ ఏటా కొనసాగిస్తోంది. గత ఆర్ధిక సంవత్సరంలో ఈ పధకం ద్వారా జీహెచ్‌ఎంసీ రూ.437.75 కోట్లు ఆదాయం సమకూర్చుకొంది.