తెలంగాణలో కనుమరుగువుతున్న టిడిపి!

SMTV Desk 2019-04-08 21:06:02  tdp, trs, telangana

హైదరాబాద్: రాష్ట్రంలో మెల్లగా టిడిపి కనుమరుగైపోతోంది. పెద్ద పెద్ద లీడర్లు సైతం తెదేపాను వీడెందుకు సిద్దమవుతున్నారు. మాజీ మంత్రి మండవ వెంకటేశ్వర్‌రావు కూడా టిఆర్‌ఎస్ తీర్థం పుచ్చుకునేందుకు సిద్ధమయ్యారు. హైదరాబాద్ నగర పార్టీ అధ్యక్షులు ఎమ్. ఎన్ శ్రీనివాస్ టిఆర్‌ఎస్ కండువా కప్పుకున్నారు. అంతకంటే ముందు నామా నాగేశ్వర్‌రావు పార్టీ మారి ఏకంగా టిఆర్‌ఎస్ నుంచి ఖమ్మం ఎంపి అభ్యర్థిగా పోటీలో ఉన్నారు. దీంతో ఇప్పుడు పార్టీకి పెద్ద దిక్కుగా మిగిలింది నలుగురైదురు నేతలే కావడం గమనార్హం. ఎన్‌టిఆర్ భవన్‌లో శనివారం ఉగాది సందర్భంగా నిర్వహించిన పం చాంగ శ్రవణం కార్యక్రమం చూస్తే ఈ విషయం స్పష్టమౌతోంది. ఎన్‌టిఆర్ భవన్‌లో ఏ చిన్న కార్యక్రమం చేసినా సీనియర్ నేతలతో పాటు, కార్యకర్తలు, అభిమానులతో కిక్కిరిసిపోయేది. కానీ ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది. భవన్‌లో శనివారం ఉగాది వేడుకల్లో టిడిపి రాష్ట్ర అధ్యక్షులు ఎల్. రమణ, సీనియర్ నాయకులు ఇ.పెద్దిరెడ్డి, రావుల చంద్రశేఖర్ రెడ్డి, బండ్రు శోభారాణి, జి.బుచ్చిలింగం మాత్రమే పాల్గొన్నారు. వీరిలో కూడా ఇద్దరితో టిఆర్‌ఎస్ సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలిసింది. పెద్ద నాయకులతో పాటు ద్వితీయ శ్రేణి నాయకులు కూడా అధికార పార్టీలోకి వెళ్లడంతో క్షేత్రస్థాయిలో టిడి పి జెండా మోసేందుకు కూడా కార్యకర్తలు కూ డా లేకపోవడం గమనార్హం. “తెలంగాణలో పార్టీ పరిస్థితి అత్యంత దయనీయంగా, దుర్భరమైన స్థితిలో ఉంది. కొత్త నాయకత్వం అవసరం.. ఆంధ్రా పార్టీ అనే ముద్రను చెరిపివేసి, కొత్త వారికి అవకాశం కల్పిస్తే భవిష్యత్‌లోనైనా కాస్త నిలబడే పరిస్థితి ఉంటుందని” పొలిట్‌బ్యూరో సభ్యులు ఒకరు మన తెలంగాణతో వ్యాఖ్యానించారు.