ఇక యూజర్ ఓకె అంటేనే వాట్సాప్ గ్రూప్

SMTV Desk 2019-04-04 16:47:25  whatsapp, whatsapp group,

వాట్సాప్ గ్రూపుల వల్ల ఎక్కడలేని తలనొప్పులు వుంటాయి. తెలిసినవాళ్లు అయితే పరవాలేదు గానీ.. ముక్కూ మొహం తెలియనివాళ్ళు కూడా రకరకాల గ్రూపుల్లో యాడ్ చేస్తుంటారు. నన్నెందుకు యాడ్ చేశారంటే ‘సర్ నేను మీకు ఎఫ్‌బీలో ఫాలోవర్‌ను, మీరు పెట్టే పోస్టులన్నీ చదువుతుంటాను. మీ మ్యూచ్‌వల్ ఫ్రెండ్ లిస్టులో నేనుంటాను’ అని పోసు వేస్తారు. అక్కడితో పోనీ పాపం అని వాట్సాప్ గ్రూపులో గమ్మున వుండిపోతారు. మరి తెలిసినవాళ్ళు కూడా పనికిమాలిన గోపీ విత్ ఫ్రెండ్స్ అని, రాజు విత్ గ్యాంగ్ అని ఇలా తలనొప్పి గ్రూపులను క్రియేట్ చేసి అందులో మనల్ని యాడ్ చేసినప్పుడు మామూలుగా మండదు. అతణ్ణి అనలేక, లెఫ్ట్ అవ్వలేక వాటిల్లో దాడి చేసినట్టు మనమీదకు వచ్చే ఫార్వాడ్ మెసేజ్‌లు, ఫోటోలు, వీడియోలను చూస్తూ భరించాలంతే.

ఇంకాస్త సహనం అలవర్చుకుని ఆ వచ్చిన ఫోటోలను, వీడియోలను రోజూవారి పనిగా డిలీట్ చేస్తుండాలి. ఇదంతా ఎందుకు చెప్పాల్సి వస్తోందంటే.. ఈమధ్య వాట్సాప్‌లో పనికొచ్చే గ్రూపులకన్నా పనికిరాని గ్రూపులే ఎక్కువయ్యాయి. ఇలాంటి వాటి బారిన పడకుండా మనలను మనం రక్షించుకునే ఫీచర్‌ను వాట్సాప్ అందుబాటులోకి తీసుకువచ్చింది. మన అనుమతి లేకుండా ఎవరూ మనల్ని కొత్తగా గ్రూప్‌లోకి యాడ్‌ చేయలేరిక. బుధవారం నుంచి వాట్సాప్‌ ఈ సరికొత్త ఫీచర్‌ను అందుబాటులోకి తెచ్చింది.

దేశంలో సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో వాట్సాప్‌ నకిలీ వార్తలకు అడ్డుకట్ట వేసేందుకు ‘టిప్‌లైన్‌’ సర్వీసును తీసుకురాగా, ఇప్పుడు గ్రూప్‌ చాట్స్‌కు మరింత భద్రత కల్పించింది. కొత్తగా పనికిమాలిన గ్రూపుల్లో జాయినవకుండా అడ్డుపడే ఫీచర్‌ను తీసుకువచ్చింది. ఎవరైనా మిమ్మల్ని కొత్తగా వాట్సాప్‌ గ్రూప్‌లోకి చేర్చాలంటే మీ అనుమతి తప్పనిసరి తీసుకోవాల్సిందే. గ్రూప్‌లో మీ నంబర్‌ యాడ్‌ చేయడానికి అడ్మిన్‌ ప్రయత్నించినప్పుడు మీరు ఆ గ్రూప్‌లో చేరాలా? వద్దా? అని మీకొక రిక్వెస్ట్‌ వస్తుంది. దానిని బట్టి మీరు నిర్ణయం తీసుకోవచ్చు.

ఈ కొత్త ఫీచర్‌ను పొందాలంటే వాట్సాప్‌ను అప్‌డేట్‌ చేసుకోవాలి. అనంతరం Account > Privacy > Groups సెలెక్ట్‌ చేసుకుంటే అక్కడ మీరు Nobody, My Contacts, Everyone ఇలా ఎవరికి అనుమతి ఇవ్వాలో ఎంపిక చేసుకోవచ్చు. Nobody అని ఎంపిక చేసుకుంటే, కొత్త గ్రూప్‌లో మిమ్మల్ని యాడ్‌ చేయాలన్నా మీ అనుమతి తప్పనిసరి అవసరం వుంటుంది. My Contacts ఆప్షన్‌ ఎంచుకుంటే మీ స్నేహితులు ఎవరైనా మిమ్మల్ని గ్రూప్‌లో యాడ్‌ చేయవచ్చు. ఇది వాట్సాప్ వినియోగదారులకు చాల వరకు తలనొప్పి తగ్గించే ఫీచర్ అంటున్నారు గ్రూపు బాధితులు.