‘టిక్ టాక్’ యాప్‌కు మద్రాస్ హైకోర్టు గట్టి షాకిచ్చింది

SMTV Desk 2019-04-04 16:46:16  Tik tok app, Madras, high court,

సోషల్ మీడియాలో సంచలనం సృష్టించిన ‘టిక్ టాక్’ యాప్‌కు గట్టి షాకిచ్చింది మద్రాస్ హైకోర్టు. ఈ చైనీస్ యాప్‌ను నిషేధించాలని కేంద్రాన్ని కోరింది. ఈ యాప్‌లో వస్తున్న అశ్లీల సంభాషణలు, అభ్యంతర వ్యాఖ్యలతో యువత, చిన్న పిల్లలు పాడవుతున్నారని.. అశ్లిలతను ఈ యాప్ ప్రోత్సహిస్తుందని భావిస్తోన్న మద్రాస్ హైకోర్టు ఈ యాప్‌ను నిషేధించేందుకు కేంద్రంపై ఒత్తిడి తీసుకొని వచ్చే ప్రయత్నాలు ప్రారంభించింది. కొన్ని రోజుల క్రితం తమిళనాడు అసెంబ్లీలో బడ్జెట్‌ ప్రతిపాదనలపై చర్చ జరుగుతున్న సందర్భంగా ఎమ్మెల్యే తమీమున్‌ హన్సారీ.. టిక్ టాక్ యాప్‌పై మాట్లాడారు. ఈ యాప్‌లో వర్గాలు, కులాలు, మతాల మధ్య హింసను ప్రేరేపించే సంభాషణలు ఉన్నాయని, అందువల్ల దీన్ని వెంటనే నిషేధించాలని డిమాండ్ చేశారు.

దీనిపై రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి మణికంఠన్ స్పందిస్తూ టిక్ టాక్ యాప్‌ను నిషేధించేందుకు చర్యలు తీసుకుంటామని, దీనిపై కేంద్రంపైనా ఒత్తిడి తీసుకొస్తామని తెలిపారు. ఈ నేపథ్యంలో మద్రాస్ హైకోర్టు తీసుకున్న నిర్ణయం కీలకంగా మారింది. ఈ మధ్యకాలంలో యువతను ఎక్కువగా ఆకర్షించిన యాప్‌ల్లో ‘టిక్ టాక్’ ఒకటి. ఇది చూడ్డానికి డబ్‌స్మాష్‌లాగానే ఉంటుంది. కానీ ఇందులో మ్యూజికల్ వీడియోస్ ఉంటాయి. డైలాగ్స్, ఎమోషన్స్, సాంగ్స్ ఇలా అన్నీ క్రియేట్ చేసి షేర్ చేసే అవకాశం ఉంటుంది. అయితే ఇందులో అశ్లీల వీడియోలు, అభ్యంతరకర సంభాషణలు కూడా పోస్ట్ కావడంపై ఫిర్యాదులు వస్తున్నాయి. దీనితో పాటు పబ్‌జి గేమ్‌ను కూడా నిషేధించాలని తల్లిదండ్రులు కోరుతున్నారు.