ఐఆర్‌సీటీసీ బంపర్ ఆఫర్ : 49 పైసలకు రూ.10 లక్షల రైల్వే ఇన్సూరెన్స్!

SMTV Desk 2019-04-04 16:00:36  irctc, train tickets booking, flight tickets booking, train journey insurence, sri ram general insurance, icici lambard general insurance, royal sudanram general insurance

ఐఆర్‌సీటీసీ ప్రయాణీకుల కోసం ఇన్సూరెన్స్ సేవలు అందిస్తుంది. ఐఆర్‌సీటీసీ ప్లాట్‌ఫామ్ ద్వారా విమాన టికెట్లను బుక్ చేసుకుంటే ఉచితంగా రూ.50 లక్షలు, అలాగే ఐఆర్‌సీటీసీ ప్లాట్‌ఫామ్‌పై రైలు టికెట్ బుక్ చేసుకుంటే రూ.10 లక్షల వరకు ఇన్సూరెన్స్ పొందొచ్చు. దీనికి కేవలం 49 పైసలు చెల్లిస్తే సరిపోతుంది. టికెట్ బుకింగ్ చేసుకునే సమయంలో ఇన్సూరెన్స్ ఆప్షన్ ఎంచుకుంటే కన్ఫార్మ్ అయిన టికెట్ లేదా ఆర్ఏసీ ఇ-టికెట్‌కు ఇన్సూరెన్స్ వస్తుంది. వెయిట్ లిస్టింగ్ టికెట్లకు ఇన్సూరెన్స్ ఉండదు. స్లీపర్, ఫస్ట్ ఏసీ, సెకండ్ ఏసీ, థర్డ్ ఏసీ ఇలా ఏ క్లా్స్ ప్రయాణానికైనా ఇన్సూరెన్స్ తీసుకోవచ్చు. ప్యాసింజర్, సబ్-అర్బన్ ట్రైన్స్‌ ప్రయాణానికి ఇన్సూరెన్స్ సదుపాయం లేదు. అలాగే ఐఆర్‌సీటీసీ వెబ్‌సైట్ ద్వారా టికెట్లను బుకింగ్ చేసుకుంటేనే ఇన్సూరెన్స్ పొందగలం. రైలు ప్రమాదానికి గురైనప్పుడు ఇన్సూరెన్స్ తీసుకున్న వ్యక్తి మరణించినా, శాశ్వత పూర్తి అంగవైకల్యం సంభవించినా రూ.10 లక్షలు ఇన్సూరెన్స్ మొత్తం వస్తుంది. ఈ మొత్తం ప్రయాణికుడికి లేదా అతని కుటుంబానికి అందుతుంది. శాశ్వత పాక్షిక అంగవైకల్యం ఏర్పడితే రూ.7.5 లక్షలు వస్తాయి. ఏమైనా గాయాలు తగిలితే హాస్పిటల్ ఖర్చుల కోసం రూ.2 లక్షలు అందుతాయి. ఇన్సూరెన్స్ సేవల కోసం ఐఆర్‌సీటీసీ మూడు బీమా కంపెనీలతో భాగస్వామ్యం కుదుర్చుకుంది. ఇందులో శ్రీరామ్ జనరల్ ఇన్సూరెన్స్, ఐసీఐసీఐ లంబార్డ్ జనరల్ ఇన్సూరెన్స్, రాయల్ సుందరం జనరల్ ఇన్సూరెన్స్ అనే కంపెనీలు ఉన్నాయి.