మసూద్‌ను బ్లాక్‌లిస్ట్‌లో చేర్చి తీరుతాం

SMTV Desk 2019-04-03 17:04:34  masood azhar, jaish e mohammed, germeny, united nation organisation, international terrorist, usa

వాషింగ్టన్‌ : జైషే ఉగ్రవాద సంస్థ అధినేత మసూద్‌ అజార్ ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించేందుకు ఐరాస భద్రతామండలిలోని సభ్య దేశాలన్నీ ప్రయత్నిస్తున్నాయి. అయితే ఒక్క చైనా మాత్రం దీనికి వ్యతిరేఖంగా వ్యవహరిస్తుంది. దీంతో మసూద్‌ అజార్‌ను బ్లాక్‌లిస్ట్‌లో చేర్చి తీరుతామని అగ్రరాజ్యం అమెరికా మరోసారి స్పష్టం చేసింది. మసూద్‌ విషయంలో ఐక్యరాజ్యసమితి భద్రతామండలి ఆంక్షల కమిటీని అతిక్రమించి అమెరికా చర్యలు చేపడుతోందని చైనా ఇటీవల ఆరోపణలు చేసింది. ఈ ఆరోపణలను యూఎస్‌ తిప్పికొట్టింది. మసూద్‌ను బ్లాక్‌లిస్ట్‌లో పెట్టేందుకు అందుబాటులో ఉన్న అన్ని వనరులను ఉపయోగించుకుంటామని అమెరికా వెల్లడించింది. అంతర్జాతీయ సమాజంలో మసూద్‌ అజార్‌ను బ్లాక్‌లిస్ట్‌లో పెట్టేందుకు మేం, మా మిత్రదేశాలు, ఐరాస భద్రతామండలిలోని దేశాలు కలిసి అందుబాటులో ఉన్న అన్ని వనరులను వినియోగించుకుంటాం అని అమెరికా విదేశాంగశాఖ ప్రతినిధి ఒకరు అంతర్జాతీయ మీడియాకు వెల్లడించారు.