ఆవిర్భావ వేళ... కొలువుల జాతర

SMTV Desk 2017-06-02 15:16:57  tspsc, notifications, ghanta chekrapani,

హైదరాబాద్, జూన్ 2 : నీళ్ళు, నిధులు, నియామకాలే ప్రధాన లక్ష్యాలుగా ప్రత్యేక రాష్ట్రంగా ఆవిర్భవించిన తెలంగాణాలో కొలువుల జాతర ప్రారంభం అయింది. 20 వేల ఉద్యోగాల భర్తీకి శ్రీకారం చుట్టిన టిఆర్ఎస్ ప్రభుత్వం అందుకు అనుగుణంగా కార్యచరణ ప్రారంభించింది. ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా 2 వేల 437 ఉద్యోగ ఖాళీల భర్తీ కోసమై 15 రకాల నోటిఫికేషన్లను ప్రభుత్వం విడుదల చేసింది. మీడియా సమావేశంలో తెలంగాణా పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ ఘంటా చక్రపాణి ఇందుకు సంబంధించిన వివరాలను వెల్లడిస్తు.... www.tspsc.gov.in వెబ్ సైట్ లో 15 రకాల నోటిఫికేషన్లకు సంబంధించిన పూర్తి వివరాలు అప్ లోడ్ చేయడం జరిగిందని వివరించారు.పోస్టుల వారిగా వయో పరిమితి, విద్యార్హతల వివరాలు కూడా వెబ్ సైట్ లో పొందుపరిచామని ప్రకటించారు. డిగ్రీ కళాశాలల్లో 546 , జూనియర్ కళాశాలల్లో 152 అధ్యాపక పోస్టులను, 304 ప్రిన్సిపాల్ పోస్టులు, పశుసంవర్ధక శాఖకు సంబంధించి 541 వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ పోస్టులు, ఐ అండ్ క్యాడ్, అర్ అండ్ బి, భూగర్భ జల వనరుల శాఖ, గిరిజన సంక్షేమ శాఖల్లో కలిపి మెుత్తం 463అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ పోస్టులు, సర్వే సెటిల్ మెంట్ అండ్ ల్యాండ్ రికార్డ్స్ సబార్డినేట్ సర్వీస్ లో 273 డిప్యూటి సర్వేయర్ పోస్టులున్నట్లు వెల్లడించారు. ఈ నెల 6 నుంచి 24 వరకు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం ఇచ్చారు. అసిస్టేంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్, ఇన్ స్పెక్టర్ ఆఫ్ బాయిలర్స్, పారెస్ట్ యూనివర్శిటీలో ప్రొఫెసర్లు, లైబ్రేరియన్ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి జులై 11 వరకు గడువు ఉంది. అయితే ఇందులో 8 క్యాటగిరీ పోస్టులకు ప్రాథమిక పరీక్ష, మెయిన్ పరీక్ష తేదిలను సైతం ప్రకటించారు. ఇక డిగ్రీ కళాశాలల్లో ప్రిన్సిపాల్, ప్రొఫెసర్, లైబ్రేరియన్ పోస్టులను కేవలం ఇంటర్వూల ద్వారానే భర్తీ చేస్తామని టిఎస్ పిఎస్ సి చైర్మన్ చక్రపాణి వెల్లడించారు. ఇక 15 రకాల నోటిఫికేషన్లలో మెుదటి 8 కేటగిరి పోస్టుల కోసం రాత పరీక్ష తేదిలను తాత్కాలికంగా ఖరారు చేశామని.. జూలై 16న ప్రాథమిక పరీక్ష, ఆగస్టు 12,13 తేదిల్లో మెయిన్ పరీక్ష నిర్వహించనున్నట్లు చెప్పారు.వెటర్నరీ అసిస్టెంట్ పోస్టులకు జూలై 23న, ఏఈఈ, వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్, ఇన్ స్పెక్టర్ ఆఫ్ బాయిలర్స్ పోస్టుల భర్తీకి ఆగస్టు 5,6 తేదీల్లో పరీక్షలు నిర్వహించనున్నట్లు వెల్లడించారు.