జగన్ - పవన్ - బాబుల షెడ్యూల్ ఇదే !

SMTV Desk 2019-04-03 12:28:15  Jagan, chandrababu, Pawan Kalyan

ఎన్నికలకి ఇంకా వారం రోజులే సమయం ఉండడంతో నేతలు ప్రచారాల్లో మునిగి తేలుతున్నారు. నిముషం కూడా ఖాళీ లేకుండా ప్రచారానికి సమయం కేటాయిస్తున్నారు. ఈ క్రమంలో ఈరోజు నెల్లూరు, ప్రకాశం, గుంటూరు జిల్లాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు ఏపీ సీఎం చంద్రబాబు. నెల్లూరు జిల్లా ఆత్మకూరులో మధ్యాహ్నం 12.45 గంటలకు ఎన్నికల ప్రచార సభలో పాల్గొననున్న ఆయనమధ్యాహ్నం 2.30 గంటలకు ఉదయగిరిలో ప్రచారం నిర్వహిస్తారు. ఇక సాయంత్రం 4 గంటలకు ప్రకాశం జిల్లా కనిగిరిలో ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్న టీడీపీ అధినేత.. సాయంత్రం 5.30 గంటలకు గుంటూరు జిల్లా వినుకొండలో ఎన్నికల ప్రచార సభలో పాల్గొని అనంతరం రాత్రి 7.30 గంటలకు నరసరావుపేటలో రోడ్‌షో నిర్వహిస్తారు.

మరోపక్క ఏపీ ప్రతిపక్ష నేత జగన్ కూడా ప్రచారంలో గట్టిగా పాల్గొంటున్నారు. ఆయన రెండ్రోజులకి ఒకసారి ప్రచారానికి బ్రేక్ ఇవ్వడం ఆ పార్టీ శ్రేణులకి నిరుత్సాహాన్ని కలిగిస్తోంది. ఈరోజు జగన్ గుంటూరు, ప్రకాశం, కృష్ణా జిల్లాల్లో ప్రచారం నిర్వహించనున్నారు. ఈరోజు ఉదయం 9.30కి గుంటూరు జిల్లా సత్తెనపల్లి, 11.30కి గురజాలలో ప్రచారం చేస్తారు. మధ్యాహ్నం 1.30కి ఒంగోలులో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తారు. మధ్యాహ్నం 3.30కి కృష్ణా జిల్లా మైలవరంలో పర్యటిస్తారు. మరోపక్క విశాఖలో ఈరోజు ఉదయం 11 గంటలకు జనసేన పార్టీ అధినేత పవన్‌ కల్యాణ్‌, యూపీ మాజీ ముఖ్యమంత్రి, బీఎస్పీ అధినేత్రి మాయావతిలు సంయుక్తంగా మీడియా సమావేశం నిర్వహించనున్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా సాయంత్రం 3 గంటలకు విజయవాడ అజిత్‌ సింగ్ నగర్‌లోని మాకినేని బసవపున్నయ్య స్టేడియంలో జరిగే జనసేన బహిరంగ సభలో పవన్‌, మాయావతి పాల్గొననున్నారు.