రికార్డు స్థాయిలో సింగరేణి వృద్ధి

SMTV Desk 2019-04-02 18:25:04  sccl, singareni colorys company limited, telangana

హైదరాబాద్ : సింగరేణి కాలరీస్ కంపెనీ టర్నోవర్‌లో గతంలో ఎప్పుడూ లేని విధంగా రికార్డు స్థాయిలో అభివృద్దిని సాధించింది. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా రూ.25 వేల కోట్ల టర్నోవర్‌ను దాటింది. 2018-19 సంవత్సరంలో సింగరేణి 21 శాతం వృద్ధితో రూ.25,828 కోట్ల టర్నోవర్ పూర్తిచేసింది. అయితే అదే క్రమంలో బొగ్గు రవాణాలో 5 శాతం వృద్ధిని, ఉత్పత్తిలో 4 శాతం వృద్ధిని సాధించి మరోసారి తన సత్తాను చాటుకొంది సింగరేణి. 2018-19లో సింగరేణి నిర్ధేశించుకున్న లక్ష్యాన్ని మించి 676.73 లక్షల టన్నుల బొగ్గును వివిధ పరిశ్రమల వారికి రవాణా చేసింది. తద్వారా గత ఏడాది రవాణా చేసిన 646.19 లక్షల టన్నులపై 5 శాతం వృద్ధిని నమోదు చేసింది. సింగరేణి చరిత్రలోనే టర్నోవర్, బొగ్గు రవాణా, బొగ్గు ఉత్పత్తి సాధించడం ఇదే ప్రధమం. సంస్థ సాధించిన ప్రగతిపై సిఎండి శ్రీధర్ సంతోషం వ్యక్తం చేశారు. కార్మికులు, అధికారులు, సూపర్‌వైజరీ సిబ్బందికి, యూనియన్ నేతలకు తన అభినందనలు తెలియజేశారు. ఇదే ఒరవడితో కొత్త ఆర్ధిక సంవత్సరానికి నిర్ధేశించుకున్న లక్ష్యాలను సాధిస్తూ పురోగమించాలని పిలుపునిచ్చారు. బొగ్గు రవాణాకు సహకరించిన రైల్వే శాఖకు శ్రీధర్ కృతజ్ఞతలు తెలిపారు.