రికార్డు స్థాయిలో జిఎస్‌టి వసూళ్లు

SMTV Desk 2019-04-02 16:34:55  gst, service tax, tax, income tax, national income, goods and service tax

న్యూఢిల్లీ : జిఎస్‌టి వసూళ్లు 2018-19 ఆర్థిక సంవత్సరంలో రికార్డు స్థాయిలో నమోదు అయ్యాయి. ఈ 2018-19 ఆర్థిక సంవత్సరంలో జిఎస్‌టి వసూళ్లు రూ.11.77 లక్షల కోట్లు కాగా, కేవలం ఒక్క మార్చి నెలలోనే ఊహించని విధంగా రూ.1.06 లక్షల కోట్లు వచ్చాయి. 2017 జూలై 1న జిఎస్‌టి అమల్లోకి వచ్చినప్పుడు తొలి నెల వసూళ్లు రూ.75.95 లక్షల కోట్లు మాత్రమే, ఆ తర్వాత నెలవారీ వసూళ్లు రికార్డు స్థాయిలో నమోదవడం 2019 మార్చి నెలలోనే కావడం విశేషం. ఈ సందర్భంగా కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ ట్విట్టర్ ద్వారా స్పందిస్తూ.. 2019 మార్చిలో రికార్డుస్థాయిలో రూ.1,06,577 కోట్లు జిఎస్‌టి రావడం చూస్తే తయారీ, వినిమయలో విస్తరణ సంకేతాలను కనిపిస్తున్నాయని అన్నారు. 201819 ఆర్థిక సంవత్సరంలో సగటు జిఎస్‌టి ఆదాయం రూ.98,114 కోట్లు కాగా, గత ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే ఇది 9.2 శాతం ఎక్కువగా ఉంది. ఈ గణాంకాలు ఆదాయ వృద్ధి సంకేతాలిస్తున్నాయని, రేటుకు సంబంధించి చేపట్టిన చర్యల కారణంగా ఇటీవల నెలల్లో రెవెన్యూ వృద్ధి నమోదైందని జైట్లీ అన్నారు.