తల్లి దండ్రులు దేవుడంటుంటే.....ప్రభుత్వం విదుల నుండి తప్పించింది

SMTV Desk 2017-08-14 17:02:55  Uttapradesh, BRD hospital, pediatric department doctor, kafeel Ahmad

గోరఖ్ పూర్, ఆగస్టు 14: చూస్తుండగానే పసి ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి. వారిని చూస్తున్న తల్లిదండ్రుల ఆవేదన. ఇది అంత చూస్తూ అన్ని విధాల ప్రయత్నించి పరిస్థితి తన చేతులు దాటిపోయిన తర్వాత కడుపుకోతను చూసిన కఫీల్ అహ్మద్ ఎంతగా కుమిలిపోయుంటాడో. చిన్నారులు ప్రాణాలు కోల్పోయిన గోరఖ్‌పూర్ ఆసుపత్రిలో పిల్లల విభాగం వైద్యుడు కఫీల్ అహ్మద్.. పసి ప్రాణాలను రక్షించేందుకు శత విధాల ప్రయత్నించాడు. గోరఖ్‌పూర్‌లోని బీఆర్‌డీ వైద్య కళాశాలలోని వార్డు నెంబరు-100లో మృత్యువు ఒక్కొక్కరినీ దరిచేరుతుంది. రాత్రి 2గంటల ప్రాంతంలో డాక్టర్ అహ్మద్‌కు ఆసుపత్రి సిబ్బంది ఫోన్‌చేసి, ఆక్సిజన్ మరో గంటలో ఆయిపోతుందని, పిల్లల పరిస్థితి ఏంటో అర్థంకావడంలేదని నర్సులు ఆయనకు తెలిపారు. మెదడు వాపుతో బాధపడుతున్న చిన్నారులకు నిరంతర ఆక్సిజన్ సరఫరా అవసరం. వెంటనే ఇంటినుంచి బయలుదేరిన అహ్మద్ తన కారులో తెలిసిన మిత్రుడి ఆసుపత్రికి వెళ్లాడు. తన మిత్రుడిని అడిగి మూడు పెద్ద ఆక్సిజన్ సిలిండర్‌లను తన కారులో తీసుకుని బీఆర్‌డీ ఆసుపత్రికి చేరుకున్నాడు. అయితే ఆ సిలిండర్లు అక్కడున్న సుమారు 80మంది చిన్నారులకు అరగంటపాటు మాత్రమే ఆక్సిజన్ సరఫరాకి సరిపోయాయి. తరువాత పరిస్థితి చేజారుతుంది, ఆక్సిజన్ లేక పిల్లల ప్రాణాలు కొట్టుమిట్టాడుతున్నాయి. ఆక్సిజన్ సిలిండర్లు వచ్చే పరిస్థితి లేదు. ఉన్నతాధికారులకు చెప్పి తను తప్పించుకోవచ్చు. కానీ, కఫీల్ అహ్మద్ అలా చేయలేదు. పిల్లలకు అంబు బ్యాగ్‌లను ఉపయోగించి ఆక్సిజన్ అందించాలని, తన జూనియర్ డాక్టర్లను పిలిచి ఆదేశించాడు. అదే సమయంలో సిలిండర్ల కాంట్రాక్టర్లకు వరుసగా ఫోన్ చేస్తూనే ఉన్నాడు. అదే సమయంలో పట్టణంలోని పలు ఆసుపత్రులకు వెళ్లిన కఫీల్ అహ్మద్ కొన్నిచోట్ల తన సంబంధాలను ఉపయోగించాడు. మరికొన్ని చోట్ల డబ్బులు ఖర్చుచేశాడు. మొత్తమ్మీద 12 సిలిండర్‌లను తీసుకుని మళ్లీ ఆసుపత్రికి చేదుకున్నాడు. వాటితో పసి హృదయాలకు ఆక్సిజన్ అందించారు. ఇంతలో ఓ కాంట్రాక్టర్ ఆక్సిజన్ సిలిండర్లు ఇవ్వడానికి తాను సిద్ధమేనని, అయితే తనకు డబ్బు తక్షణమే ఇవ్వాలని డాక్టర్ అహ్మద్‌కు ఫోన్‌ చేశాడు. వెంటనే ఆసుపత్రి ఫ్యూన్ ఒకరికి తన కార్డు ఇచ్చి వెళ్లి ఏటీఎం నుంచి పదివేలు విత్‌డ్రా చేసుకుని రమ్మన్నాడు. అయితే ఆ సిలిండర్లు కూడా కొన్నిగంటలపాటే ప్రాణాలు కాపాడగలిగాయి. చాలామంది ప్రాణాలు రక్షించినా, కొంతమంది మరణించారు. ఆ పసి ప్రాణాలను డబ్బు, వైద్యులు కూడా కాపాడలేకపోయారు. ఇంక అప్పుడు ఏం చేసిన పరిస్థితి తన చేతుల్లో లేదు అని అర్ధమైన కఫీల్ అహ్మద్ తన పీడియాట్రిక్‌వార్డు గోడకు ఆనుకుని ఏడ్చేశాడు. డబ్బు ఉంది, ఆక్సిజన్ లేదు. వైద్యులు ఉన్నారు, సమయం లేదు. కాగా పిల్లల మరణాలకు డాక్టర్ కఫీల్ అహ్మద్ నిర్లక్ష్యమే కారణమంటూ ప్రభుత్వం విధుల నుండి తొలగించింది. కానీ, తల్లిదండ్రులు మాత్రం ఆయన్ని దేవుడంటూ కొనియాడటం గమనార్హం. కళ్ల ముందు పిల్లల ప్రాణాలు పోయాయి అనే బాధే ఎక్కువగా ఉంది, నా ఉద్యోగం పోయినందుకు బాధ లేదని డాక్టర్ అంటున్నారు.