‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ కు సుప్రీం కోర్టులో ఎదురుదెబ్బ

SMTV Desk 2019-04-01 16:56:58  Supreme court, rgv

సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ దర్శకత్వం వహించిన చిత్రం ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’. విశ్వ విఖ్యాత నటసార్యభౌమ, అన్న ఎన్టీఆర్ జీవితంలోని చివరి ఘట్టాలను ఆధారంగా చేసుకుని వర్మ ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు. అయితే ఈ సినిమాను ప్రారంభించినప్పటి నుంచి వివాదాలు ముసురుకున్నాయి. అవి కాస్తా రిలీజ్ డేట్ దగ్గరికి వచ్చేసరికి మరింత ముదిరిపోయాయి. అయితే సినిమా మార్చి 29 వ తేదీన భారీ ఎత్తున ఆంధ్రప్రదేశ్ మినహా మిగతా అన్ని ప్రాంతాల్లో రిలీజ్ చేశారు. ఆంధ్రప్రదేశ్‌లో హైకోర్టు జారీ చేసిన ఇంజక్షన్ గ్రాంట్ వల్ల విడుదల ఆగిపోయింది. ఏప్రిల్ 3 వరకు ఏపీలో ఈ సినిమాపై స్టే ఉంది. దీంతో లక్ష్మీస్ ఎన్టీఆర్ నిర్మాతలు సుప్రీం కోర్టును ఆశ్రయించారు.

ఈ సినిమా విడుదలపై స్టే ను ఎత్తివేయాలని వారు పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై తాజాగా సుప్రీం స్పందించింది. ఈ పిటిషన్‌పై అంత అర్జెంట్‌గా విచారణ చేపట్టాల్సిన అవసరం లేదని భావించిన సుప్రీం.. పిటిషన్‌ను కొట్టివేసింది. దీంతో వర్మకు సుప్రీం కోర్టులో ఎదురు దెబ్బ తగిలినట్లైంది. మరి ఎన్నికలకు ముందే ఎలాగైనా ఈ సినిమాను ఏపిలో రిలీజ్ చేయాలని పట్టుబట్టిన వర్మ సుప్రీం నిర్ణయంపై ఎలా స్పందిస్తారో చూడాలి.