జాతీయ మీడియా సర్వే సంచలనం !

SMTV Desk 2019-04-01 13:59:07  ycp, tdp,

ఏపీలో 175 అసెంబ్లీ, 25 లోక్ సభ స్థానాలకు ఎన్నికలు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ సారి కూడా నవ్యాంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం పార్టీ విజయదుందుభి మోగిస్తుందని ఓ సర్వే సంస్థ ప్రకటించింది. ఇప్పటిదాకా అనేక జాతీయ మీడియా సంస్థలు వైసీపీదే గెలుపు అని చెబుతుండగా మొట్టమొదటిసారి ‘టీడీపీదే హవా’ అనే అంచనాలను వెలువరించింది ఏబీపీ చానల్. ఏబీపీ చానల్ కోసం లోక్ నీతి-సీఎస్డీఎస్ నిర్వహించిన ఈ సర్వేలో టీడీపీకి 126 నుంచి 135 అసెంబ్లీ సీట్లు లభిస్తాయని, 18 నుంచి 22 లోక్ సభ స్థానాలు దక్కుతాయని అంచనా వేశారు.

వైసీపీ గత ఎన్నికల మాదిరే ఈసారి కూడా ద్వితీయస్థానానికే పరిమితం అవుతుందని, ఆ పార్టీకి 45 నుంచి 50 అసెంబ్లీ స్థానాలు, 3 నుంచి 5 లోక్ సభ స్థానాలు దక్కుతాయని జనసేన 2 నుంచి 5 వరకు అసెంబ్లీ స్థానాల్లో విజయం సాధించవచ్చునని తెలిపింది. బీజేపీ, కాంగ్రెస్‌ రాష్ట్రంలో ఖాతా తెరిచే అవకాశం లేదని తేల్చింది. తెలుగుదేశం పార్టీకి 46.2 శాతం ఓట్లు లభిస్తాయని లోక్‌నీతి-సీఎ్‌సడీఎస్‌ అంచనా వేసింది. వైసీపీకి 37.2 శాతం ఓట్లు మాత్రమే వస్తాయని తెలిపింది. టీడీపీకి తిరుగులేని మెజారిటీ ఖాయమని లోక్ నీతి-సీఎస్డీఎస్ సర్వే పేర్కొంది. మార్చి 11 నుంచి 19వ తేదీ నడుమ అన్ని వయసుల ఓటర్ల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుని ఈ సర్వే చేపట్టారని చెబుతున్నారు.