కామన్ మొబిలిటీ కార్డు.. అంటే తెలుసా?

SMTV Desk 2019-04-01 13:57:36  Comman mobility card,

మెట్రో రైలు.. రైలు.. ఆర్టీసీ బస్సు.. ఎంఎంటీఎస్.. ఆటోలు.. క్యాబ్‌లు ఇలా ఎందులో ప్రయాణించాలన్నా వేర్వేరుగా డబ్బులు చెల్లించి టిక్కెట్ కొనుగోలు చేయాలి. రద్దీ నగరాల్లో ఎంతోమందికి ఇది ఇబ్బందికరంగా మారింది. కొన్ని సమయాల్లో టిక్కెట్ తీసుకునే సమయం దొరకదు. బస్సుల్లో ప్రయాణించే సమయంలో టిక్కెట్ తీసుకోవాలంటే కండక్టర్ మన వద్దకు ఎప్పుడు వస్తాడా అని ఎదురు చూడాల్సిన పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే అంత రద్దీ ఉంటుంది. ఈ సమస్యలన్నింటికి హైదరాబాద్‌లో చెక్ పడనుంది.

ప్రయాణీకులకు ఉమ్మడి కార్డు (కామన్ మొబిలిటీ కార్డు) జారీ చేసే ఆలోచనలో ఉంది. మెట్రో రైలు, ఎంఎంటీఎస్, ఆర్టీసీ బస్సులు, ఆటోలు, క్యా‌బ్‌లలో రవాణాకు ప్రయాణికుల సౌకర్యార్థం కామన్ మొబిలిటీ కార్డును అందించేందుకు ఏజెన్సీని ఎంపిక చేయడం కోసం ఆర్‌ఎఫ్‌పీ (రిక్వెస్ట్ ఫర్ ప్రపోజల్) జారీ చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్‍‌కే జోషి ఇటీవల అధికారులను ఆదేశించారు.

నాలుగు రోజుల క్రితం కామన్ మొబిలిటీ కార్డులపై సెక్రటరియేట్‌లో సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడారు. మొబిలిటీ కార్డు రవాణాతో పాటు ఇతర అవసరాలకు కూడా ఉపయోగపడేలా ఉండాలని చెప్పారు. క్యూఆర్ కోడ్, స్వైపింగ్ తదితర ఓపెన్ లూప్ టికెటింగ్ సిస్టం ఉండాలని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం సిఫార్స్ చేసిన నేషనల్ కామన్ మొబిలిటీ కార్డు, ఎన్పీసీఐ (నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా)పై ఆయన చర్చించారు. ప్రపంచవ్యాప్తంగా అమలవుతున్న పద్ధతులు, భవిష్యత్తు టెక్నాలజీని దృష్టిలో పెట్టుకొని కార్డును రూపొందించేలా బాధ్యతలు అప్పగించాలని సూచించారు. ఈ సమావేశంలో అధికారులతో పాటు ఓలా, ఉబేర్, ఆటో యూనియన్లు, సర్వీస్ ప్రొవైడర్లు, బ్యాంకు, ఎల్ అండ్ టీ ప్రతినిధులు పాల్గొన్నారు. హైదరాబాదు నగరంలో మెట్రో, రైలు, ఆర్టీసీ తదితర వాహనాల్లో ఒకే కార్డుతో ప్రయాణించేలా సులభతరం చేయనున్నారు.