వరకట్న వేదింపులు : కోడలి కడుపుమాడ్చిన అత్త

SMTV Desk 2019-03-31 15:52:55  dowry case, kerala, dowry

తిరువనంతపురం, మార్చ్ 31: కేరళలో దారుణం చోటు చేసుకుంది. కోడలు కట్నం తీసుకురాలేదని అత్తింటివారు అతి కిరాతకంగా వేధించి ప్రాణాలు తీశారు. వరకట్నం కోసం కోడలికి అన్నం పెట్టకుండా కడుపు మాడ్చారు. దీంతో ఆమె తిండీ నీరు లేక చిక్కి శల్యమై చనిపోయింది. పూర్తి వివరాల ప్రకారం...కొల్లాం సమీపంలోని కరునాగపల్లికి చెందిన తుషార(27)కు, చందూలాల్‌కు ఇచ్చి 2013లో వివాహం చేశారు. వరకట్నం కింద కొంత డబ్బు, బంగారు ఆభరణాలు ఇచ్చారు. రూ.2 లక్షలు తర్వాత ఇస్తామని మాటిచ్చారు. చందూలాల్ వెల్డింగ్‌ పని చేస్తాడు. వారికి ఇద్దరు సంతానం ఉన్నారు. అయితే పెళ్లి అయినప్పటినుంచి తుషారను అత్తింటివారు అదనపు కట్నం తీసుకురావాలని వేధిస్తున్నారు. గత కొన్ని రోజులుగా తుషారకు పూర్తిగా అన్నం పెట్టకుండా చేశారు. నానబెట్టిన బియ్యం, చక్కెర నీటితోనే నెట్టుకొచ్చారు. దీంతో తుషార ఎముకలగూడులా మారి ఈనెల 21న అర్ధరాత్రి అనారోగ్యంతో ప్రభుత్వ ఆస్పత్రిలో మరణించింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. పోలీసుల దర్యాప్తులో అత్తింటి వారి హింస వెలుగులోకి వచ్చింది. ఆమె భర్త చందూలాల్‌, అత్త గీతాలాల్‌లను అరెస్టు చేశారు. తుషార శరీరంపై ఏమాత్రం కండరాలు లేవని, 20 కిలోల బరువుతో ఎముకల గూడులా మారిందని పోలీసులు తెలిపారు. భర్త, అత్త మానసికంగా, శారీరకంగా వేధించినట్లు పొరుగింటి వ్యక్తి తెలిపారు. అత్తింటివారు గత ఐదేళ్లుగా తుషారను కట్నం కోసం వేధిస్తున్నారని, ఏడాది కాలంగా తమ కుమార్తెను కలుసుకోకుండా చేశారని ఆమె తల్లి విజయలక్ష్మి ఆరోపించారు. తమ కుమార్తెను ఎంతగా హింసించినా, ఆమె జీవితం ఇబ్బందిలో పడుతుందనే భయంతో తాము పోలీసులకు ఫిర్యాదు చేయలేదన్నారు.