కనువిందు చేస్తున్న విద్యుత్ అలంకరణలు..

SMTV Desk 2017-06-02 13:43:51  telangana formation day, decorating telangana, pared grounds, electricity office,

హైదరాబాద్, జూన్ 2: తెలంగాణా రాష్ట్రం ప్రత్యేక అలంకరణలు, విద్యుత్ దగదగలతో మెరిసి పోతోంది. రాష్ట్ర ఆవిర్భావం సందర్భంగా చారిత్రాత్మక కట్టడాలు, ప్రభుత్వ కార్యాలయాలు, ప్రధాన కూడళ్ళను, పార్కులను విద్యుత్ అలంకరణలతో తీర్చిదిద్దారు. హైదరాబాద్ నగరం మరింత శోభాయమానంగా వెలుగులు విరజిమ్ముతోంది. గురువారం అర్ధరాత్రి నుంచే రాష్ట్ర అవిర్భావ సంబురాలు మెుదలయ్యాయి.రంగురంగుల విద్యుత్ దీపాలతో హైదరాబాద్ నగరం కొత్త కాంతులను విరజిమ్ముతోంది. గన్ పార్క్ లోని అమరవీరుల స్థూపం వద్ద ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. హుస్సేన్ సాగర్, తెలుగుతల్లి ఫ్లై ఓవర్ బ్రిడ్జి నుండి లుంబినీ పార్కు, ఎన్టీఆర్ ఘాట్, ఎన్టీఆర్ గార్డెన్, ఐమాక్స్ చౌరస్తా, నెక్లెస్ రోడ్ ప్రాంతాల్లో రంగురంగుల విద్యుత్ అలంకరణలు ఏర్పాటు చేశారు. అదే విధంగా తెలంగాణా ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పలు ప్రధాన హోటల్స్ లో తెలంగాణా పుడ్ ఫెస్టివల్ వేడుకలు నిర్వహిస్తున్నారు. సికింద్రాబాద్ పరేడ్ మైదానంలో ఆవిర్భావదినోత్సవానికి ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. జిల్లా యువజన, క్రీడకారుల ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం నిర్వహించనున్నారు. టిఎస్ ఎస్ పి డీ సి ఎల్ ప్రధాన కార్యాలయంలో సాంస్కృతిక కార్యక్రమాలు భారీగా నిర్వహించేందుకు ఏర్పాటు చేశారు. ప్రధాన కార్యాలయంతో పాటు మింట్ కాంపౌండ్ లోని విద్యుత్ శాఖ కార్యాలయాలను విద్యుత్ దీపాలతో అలంకరించారు. అదే విధంగా రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా కేంద్రాలలో, మున్సిపల్ పట్టణాలు, మండల కేంద్రాలలో ప్రభుత్వ కార్యాలయాలు, ఇతర ప్రముఖ స్థలాలలో విద్యుత్ అలంకరణలతో తీర్చిదిద్దారు. సంబురాలు పతాకావిష్కరణ కార్యక్రమాలతో ప్రారంభం అవుతాయి. అదే విధంగా జిల్లా కేంద్రాలలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. సంబురాల సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా పండగ వాతావరణం నెలకోంది. ఇక జిల్లా, రెవెన్యూ, డివిజన్, మండలాల స్థాయిలో ఏర్పాట్లు పూర్తి చేసినట్లు హైదరాబాద్ జిల్లా కలెక్టర్ రాహూల్ బొజ్జా తెలిపారు. కలెక్టరేట్లో జాతీయ జెండా ఎగురవేయడంతో పాటు రెడ్ క్రాస్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం నిర్వహించనున్నట్లు తెలిపారు. అదే విధంగా సాయంత్రం 5 గంటలకు పబ్లిక్ గార్డెన్స్ లో ఇందిరా ప్రియదర్శిని ఆడిటోరియంలో హోమంత్రి నాయిని నర్సింహారెడ్డి చేతుల మీదుగా వివిధ రంగాల్లో విశిష్ట సేవలందించిన వారికి జిల్లా స్థాయి అవార్డుల ప్రధానం చేయనున్నట్లు ఆయన వివరించారు. అమరవీరుల కుటుంబ సభ్యులను సన్మానించనున్నారు.