కొండచరియలు విరిగి పడి 50 మంది సజీవ సమాధి..

SMTV Desk 2017-08-14 12:17:30  HIMACHAL PRADESH, BUS ACCEDENT, 50 MEMBERS DIED.

సిమ్లా, ఆగస్ట్ 14 : హిమాచల్ ప్రదేశ్ లో హఠాత్తుగా కొండచరియలు విరిగిపడిన ఘటనలో 50 మంది ప్రాణాలు కోల్పోవలసి వచ్చింది. హిమాచల్‌లోని మండి-పఠాన్‌కోట్ జాతీయ రహదారికి సమీపంలోని కోట్‌పురి వద్ద ఈ ఘటన చోటుచేసుకుంది. 55 మంది ప్రయాణిస్తున్న రెండు బస్సులపై ఒక్కసారిగా పెళపెళమంటూ కొండచరియలు విరుచుకుపడి ఆ బస్సులను దాదాపు 800 మీటర్ల లోతున్న లోయలోకి తోసేశాయి. దీంతో బస్సులు నుజ్జునుజ్జయి అందులోని ప్రయాణికులు సజీవ సమాధి అయ్యారు. ఈ దుర్ఘటనకు సంబంధించి ఇప్పటివరకు 46 మృతదేహాలను వెలికి తీయగలిగారు. వీరిలో 23 మందినే గుర్తించగలిగారు. మిగిలినవారిని గుర్తించడానికి ఫోరెన్సిక్‌ నిపుణుల్ని రంగంలో దించారు. మరో 12 మంది క్షతగాత్రుల్ని మండీలోని ఆసుపత్రులకు తరలించినట్లు సమాచారం. కాగా కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా కొండచరియలు విరిగి పడినట్లు అధికారులు తెలిపారు. ముఖ్యమంత్రి వీరభద్ర ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలను స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. ప్రభుత్వం తరుపున మృతుల కుటుంబాలకు రూ. 4 లక్షలు, రవాణా శాఖ నుంచి మరో లక్ష రూపాయలు అందిస్తామని ప్రకటించారు. ఈ విషయం తెలిసిన ప్రధాని మోదీ తీవ్ర దిగ్బ్రాంతిని వ్యక్తం చేసారు. బాధిత కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.