నేడు పార్టీ అధినేతల షెడ్యూల్ ఇదే !

SMTV Desk 2019-03-31 12:46:56  ap cm, jagan

ఎన్నికల ప్రచారంలో భాగంగా తెలుగుదేశం అధినేత చంద్రబాబునాయుడు ఆదివారం పాయకరావుపేట పట్టణంలో రోడ్డు షో నిర్వహించనున్నారు. ముందుగా ప్రకటించిన షెడ్యూల్‌ ప్రకారం చంద్రబాబు తుని బహిరంగ సభలో పాల్గొని అక్కడి నుంచి హెలికాప్టర్‌ ద్వారా పాయకరావుపేట నియోజకవర్గంలోని నక్కపల్లిలో ఏర్పాటు చేసే బహిరంగ సభకు హాజరు కావాలి. కానీ హెలిప్యాడ్‌ ఏర్పాటు విషయంలో సాంకేతిక సమస్యలు తలెత్తడంతో ఇక్కడ బహిరంగ సభను రద్దుచేశారు. దీనికిబదులు తుని బహిరంగ సభ తరువాత రోడ్డు మార్గంలో పాయకరావుపేట చేరుకుంటారు. ఇక్కడ రోడ్‌ షో నిర్వహించిన అనంతరం తిరిగి హెలికాప్టర్‌ ద్వారా విశాఖ వెళతారని టీడీపీ నేతలు, పోలీసు వర్గాల సమాచారం.

ఇక వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌ నేడు నెల్లూరు, ప్రకాశం, కృష్ణా జిల్లాల్లో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించనున్నారు. ఉదయం 9.30 గంటలకు గూడూరు, 11.30 గంటలకు గిద్దలూరు, మధ్యాహ్నం 1.30 గంటలకు దర్శి, 3.30 గంటలకు మైలవరంలో జరిగే ప్రచార సభల్లో జగన్‌ పాల్గొంటారని పార్టీ ప్రధాన కార్యదర్శి తలశిల రఘురామ్‌ ఓ ప్రకటనలో తెలిపారు. ఇదే సమయంలో వైసీపీ గౌరవాధ్యక్షురాలు విజయమ్మ ఇచ్ఛాపురం, నరసన్నపేట, ఆముదాలవలస పట్టణాల్లో జరిగే బహిరంగ సభల్లో పాల్గొంటారని వెల్లడించారు. జగన్‌ సోదరి షర్మిల నేడు గుంటూరు జిల్లా పెదకూరపాడు, నరసరావుపేట అసెంబ్లీ నియోజకవర్గాలతో పాటు ప్రకాశం జిల్లా అద్దంకి, చీరాల నియోజకవర్గాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు.
మరోపక్క గాజువాకలో రాజకీయ కార్యకలాపాలు, నివాసం కోసం ఓ ఇంటిని అద్దెకు తీసుకున్నారు. ప్రత్యర్థ పార్టీల నుంచి స్థానికేతరుడనే విమర్శలు రావడం.. స్థానికంగా కనీసం పార్టీ కార్యాలయం కూడా లేదనడంతో గాజువాకలో నివాసం అద్దెకు తీసుకున్నారు పవన్. గాజువాక వై జంక్షన్ సమీపంలోని కర్ణవానిపాలెంలో నివాసాన్ని ఏర్పాటు చేసుకున్నారు. ఇకపై గాజువాక నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉంటాననే సంకేతాలు పంపుతున్నారు ఎన్నికల తర్వాత కూడా ఆ ఇంటి నుంచే ఉత్తరాంధ్ర జిల్లాలకు సంబంధించిన పార్టీ వ్యవహారాలను పర్యవేక్షిస్తారని జనసేన నేతలు చెబుతున్నారు.