హైదరాబాద్‌ మెట్రో తాజా సమాచార్

SMTV Desk 2019-03-31 12:39:19  hyderbad, metro,

అమీర్‌పేట్‌-హైటెక్‌సిటీ మెట్రో మార్గంలో ప్రయాణించేవారికి ఓ శుభవార్త. నేటి నుంచి పెద్దమ్మగుడి మెట్రో స్టేషన్ ప్రయాణికులకు అందుబాటులోకి వచ్చింది. హైటెక్ సిటీ స్టేషన్ వద్ద మెట్రో రైలు పట్టాలు మారి వెనక్కు తిరిగి వచ్చే రివర్సల్ సౌకర్యం లేనందున, నాగోల్-అమీర్‌పేట్‌-హైటెక్‌సిటీ మార్గంలో ప్రయాణించే రైళ్ల అనుసంధానం కోసం జూబ్లీహిల్స్‌ చెక్‌పోస్టు, పెద్దమ్మగుడి, మాదాపూర్‌ మెట్రో స్టేషన్లలో మెట్రో రైళ్లు ఆపకూడదని మొదట నిర్ణయించారు. కానీ దానివలన ప్రయాణికులు చాలా ఇబ్బంది పడుతున్నారని గ్రహించి పెద్దమ్మగుడి మెట్రో స్టేషన్లో ఆపినా రైళ్ల అనుసంధానంలో పెద్దగా ఇబ్బంది ఉండదని నిర్ధారించుకొన్నాక ఈ నిర్ణయం తీసుకొన్నారు.

పెద్దమ్మగుడి స్టేషన్‌ నుంచి మాధాపూర్ స్టేషన్ ఒక కిమీ దూరంలోను, జూబ్లీహిల్స్‌ చెక్‌పోస్టు మెట్రో స్టేషన్‌ 900 మీటర్ల దూరంలోను ఉన్నాయి. కనుక పెద్దమ్మగుడి స్టేషన్లో మెట్రో రైళ్లను ఆపినట్లయితే ఆ రెండు స్టేషన్ల పరిసరాలలో నివసించేవారికి లేదా ఆ ప్రాంతాలకు రాకపోకలు సాగించేవారికి సౌకర్యంగా ఉంటుందని మెట్రి అధికారులు భావిస్తున్నారు. త్వరలోనే హైటెక్ సిటీ స్టేషన్ వద్ద రివర్సల్ విధానానికి అవసరమైన పనులు పూర్తి చేసి జూబ్లీహిల్స్‌ చెక్‌పోస్టు, మాదాపూర్ మెట్రో స్టేషన్లలో కూడా రైళ్లను నిలుపుతామని మెట్రో అధికారులు తెలిపారు.