“సమ్మె” బాట పడుతున్న జెట్‌ పైలట్లు

SMTV Desk 2019-03-31 12:21:01  jet airways

న్యూఢిల్లీ : అప్పుల ఊబిలో కొట్టుమిట్టాతున్న జెట్ ఎయిర్ వేస్‌కు మరో షాక్ తగలనుంది. వేతనాలు ఇవ్వకపోవడంతో జెట్ పైలట్లు సమ్మె బాట ఎంచుకున్నారు. ఏప్రిల్ 1వ తేదీ నుంచి విమానాలు నడిపేది లేదని 1000 మందికి పైగా పైలట్లు స్పష్టం చేశారు. జీతాలపై కంపెనీ ఇంతవరకూ ఎలాంటి సమాచారం ఇవ్వకపోవడంతో ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు పైలట్ల సంఘం నేషనల్‌ ఏవియేటర్స్‌ గిల్డ్‌ వెల్లడించింది. మార్చి 29 కల్లా ఎస్‌బీఐ నుంచి తాత్కాలిక నిధులు వస్తాయని భావించాం.. కానీ దురదృష్టవశాత్తు నిధుల బదిలీ జరగలేదు. అంతేగాక.. పైలట్ల జీతాల చెల్లింపులపై యాజామాన్యం నుంచి ఇప్పటివరకు ఎలాంటి సమాచారం రాలేదు. దీంతో ఏప్రిల్‌ 1 నుంచి విమానాలు నడపబోమని మేం నిర్ణయం తీసుకున్నామని ఎన్‌ఏజీ అధ్యక్షుడు కరణ్‌ చోప్రా తెలిపారు.

అప్పులతో సంక్షోభంలో ఉన్న జెట్‌ ఎయిర్‌వేస్‌ గత నాలుగు నెలలుగా సిబ్బందికి వేతనాలు అందించకపోవడంతో.. జీతాలు లేక జెట్‌ సిబ్బంది తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఇప్పుడు యాజమాన్యం మారినా.. వేతనాలపై స్పష్టత లేకపోవడంతో జెట్‌ పైలట్లు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. మార్చి 31లోగా వేతనాలు చెల్లించపోతే ఏప్రిల్‌ 1 నుంచి విధులను బహిష్కరిస్తామని గతంలోనే హెచ్చరించారు. తాజాగా జెట్‌కు బ్యాంక్‌ నుంచి ఎలాంటి నిధులు రాకపోవడంతో సోమవారం నుంచి విమానాలు నడపబోమని స్పష్టం చేశారు.