లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమాపై జగన్ స్పందన

SMTV Desk 2019-03-30 18:48:48  jagan, laksmis ntr

ఆంధ్రప్రదేశ్ మినహా ఇతర ప్రాంతాల్లో విడుదలైన లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమాకు పాజిటివ్ టాక్ వస్తోంది. ఏపీలో ఈ సినిమా ప్రదర్శనకు అనుమతి ఇచ్చేది లేనిది ఏప్రిల్ 3న నిర్ణయిస్తామని హైకోర్టు చెప్పడంతో... దీనిపై సుప్రీంకోర్టుకు వెళతామని దర్శకుడు రామ్ గోపాల్ వర్మ, చిత్ర నిర్మాత స్పష్టం చేశారు. అయితే ఈ సినిమాపై వైసీపీ అధినేత, ఏపీ ప్రతిపక్ష నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్పందించారు. చిత్తూరు జిల్లా పుత్తూరులో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న వైఎస్ జగన్... లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా ఏపీలో విడుదల కాకుండా చంద్రబాబు అడ్డుకున్నారని ఆరోపించారు.

తనకు వ్యతిరేకంగా తెరకెక్కిన లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమాను ఏపీలో ఎవ్వరూ చూడకూడదని చంద్రబాబు భావిస్తున్నారని వైఎస్ జగన్ అన్నారు. ఆ సినిమా ఎన్టీఆర్ జీవిత చరిత్రపై తెరకెక్కించారని తెలిపారు. ఏపీ ప్రజలు తనకు అనుకూలమైన మహానాయకుడు మాత్రమే చూడాలని చంద్రబాబు కోరుకుంటున్నారని జగన్ మండిపడ్డారు. టీడీపీ ప్రభుత్వం తమకు అనుకూలమైన పత్రికలు, టీవీలను మాత్రమే ప్రజలు చూడాలని అనుకుంటోందని ధ్వజమెత్తారు. వాళ్ల స్కూళ్లు, వాళ్ల ఆస్పత్రికి వెళ్లి ఎంత డబ్బు అడిగితే అంత డబ్బు చెల్లించాలని ప్రభుత్వం భావిస్తోందని వైఎస్ జగన్ ఆరోపించారు.