మోదీ పయనం ఇటు వైపు?

SMTV Desk 2017-08-13 17:00:03  barclays, chief economist, siddhartha sanyal, Modi, PM, prime minister

న్యూఢిల్లీ, ఆగస్ట్ 13: 2014 ఆగస్ట్‌లో జన ధన్ ఖాతాతో మొదలుపెట్టి తనదైన అభివృద్ధి వ్యూహాన్ని రచించిన మోదీ ఇప్పటి వరకు ఎన్నో సంస్కరణలు చేశారు. ఈ క్రమంలో దేశ ప్రజల నుండి సంతృప్తి పొందిన పథకాల కంటే అసంతృప్తి వ్యక్తం చేసిన సంస్కరణలే అధికంగా ఉన్నాయి. నల్ల కుబేరులపై పోరులో భాగంగా నోట్లను రద్దు చేసి అత్యధిక సంఖ్యలో సామాన్య ప్రజానీక అసంతృప్తిని మూటకట్టుకున్నారు. పెట్రోల్, డీజిల్ అమ్మకానికి కొత్త విధానాన్ని అమలు చేశారు. ఆధార్ అనుసంధాన కార్యక్రమాన్ని కూడా ప్రారంభించారు. ఇటీవల ప్రవేశ పెట్టిన జీఎస్టీ బిల్లుతో సరికొత్త పన్ను విధానం అమలు చేస్తున్నారు. కాగా, ఆ మధ్య నగదు రహిత లావాదేవీలను కూడా ప్రోత్సహిస్తూ రూ. 2 లక్షలకు మించి విలువ మేరకు ఏ కొనుగోలు, అమ్మకం అయినా నగదు రూపంలో జరగకుండా నిషేధం విధించారు. ఇకపై ఆయన ఇలాంటి సంస్కరణలకు స్వస్తి పలికి పార్టీ బలోపేతానికి, ప్రజల మన్ననను పొందే సంస్కరణల వైపు పయనిస్తారని బార్క్ క్లేస్ ఇండియా ముఖ్య ఆర్థికవేత్త సిద్ధార్థ సన్యాల్ అంచనా వేశారు. ఎందుకంటే 2019 సార్వత్రిక ఎన్నికలకు కేవలం ఏడాదిన్నర సమయమే ఉండటమేనని సన్యాల్ పేర్కొన్నారు. గత సార్వత్రిక ఎన్నికల్లో గెలిచిన ప్రాంతాలతో పాటు మిగిలిన ప్రాంతాలను కూడా కైవసం చేసుకునే యోచనలో మోదీ ఉన్నట్లు ఆయన తెలిపారు. ఇప్పటి వరకు చేపట్టిన సంస్కరణలు, ప్రాజెక్టుల తాలూకూ ఫలితాల బలోపేతంపై దృష్టి పెడతారని అంచనా వేస్తున్నట్టు సన్యాల్ ప్రకటించారు.