రాకెట్‌ ప్రయోగాన్ని ప్రత్యక్షంగా మీరూ చూడొచ్చు

SMTV Desk 2019-03-29 11:15:58  Rocket, isro.

ఇప్పటివరకు భారతీయ అంతరిక్ష సంస్థ (ఇస్రో) నిర్వహించే రాకెట్ ప్రయోగాలను చూడాలంటే యాజమాన్యం నుంచి ప్రత్యేక అనుమతి తీసుకోవాల్సిన పరిస్థితి. దీని వలన సామాన్యులకు ఈ ప్రయోగ వీక్షణ లభించేది కాదు. కానీ ఇప్పుడు ఇస్రో యాజమాన్యం ఆ పరిస్థితికి స్వస్తి పలికింది. ప్రపంచంలో ఏ స్పేస్ సెంటర్‌లో లేని విధంగా సామాన్యుడు సైతం ముందస్తు అనుమతి లేకుండా కేవలం తన వద్ద ఉన్న గుర్తింపు కార్డుతో రాకెట్‌ ప్రయోగాన్ని ప్రత్యక్షంగా వీక్షించే అవకాశం కల్పించనుంది. ఈ మేరకు ఏపీలోని రాకెట్ లాంచింగ్ సెంటర్ శ్రీహరికోటలో ఏర్పాట్లు జరుగుతున్నాయి. భారత అంతరిక్ష ప్రయోగ కేంద్రమైన సతీశ్‌ ధవన్‌ స్పేస్‌ సెంటర్‌‌లో సుమారు రూ.180 కోట్లతో సందర్శకుల కోసం ఆడిటోరియం నిర్మాణానికి ఇస్రో శ్రీకారం చుట్టింది. దీని మొదటి దశ పనులు పూర్తై.. ఈ నెల 31న ప్రారంభానికి సిద్దం అయింది.

సతీశ్‌ ధవన్‌ స్పేస్‌ సెంటర్‌‌‌లోని సీఐఎస్‌ఎఫ్‌ బ్యారక్‌ సమీపంలోని 80 ఎకరాల స్థలంలో సందర్శకుల సముదాయ ప్రాజెక్టుకు ఫిబ్రవరి 9న షార్‌ సంచాలకులు ఎస్‌.పాండ్యన్‌ భూమిపూజ చేశారు. ఇందులో ఏడు రకాల వసతులైన ఎంట్రెన్సు ఫ్లాజా, అంతరిక్ష థియేటర్‌, అంతరిక్ష మ్యూజియం, నాలెడ్జ్‌, లెర్నింగ్‌ సెంటర్‌, రాకెట్‌, ఉపగ్రహాల గార్డెన్‌, లాంచ్‌ వ్యూ గ్యాలరీ, బస్సు టూర్‌ పాయింట్‌ అందుబాటులోకి రానున్నాయి. దీన్ని ఎంతో ఆధునికంగా నిర్మించనున్నారు. ఇక్కడి నుంచి రాకెట్‌ ప్రయోగాన్ని వీక్షించడంతో పాటు ప్రయోగం ముందు, ఆ తర్వాత జరిగే కార్యక్రమాలన్నీ వీడియోలో చూసే అవకాశం ఉంటుంది. రాకెట్‌ ప్రయోగం లేని రోజుల్లో సైతం సందర్శకులకు అనుమతి ఉంటుంది. సందర్శకుల సముదాయంలో పదివేల మంది రాకెట్‌ ప్రయోగాన్ని ప్రత్యక్షంగా వీక్షించే వీలుంది. ప్రస్తుతం మొదటి దశ పనులు పూర్తయ్యాయి. ఐదువేల మంది ఇక్కడి నుంచి రాకెట్‌ ప్రయోగాన్ని ప్రత్యక్షంగా వీక్షించవచ్చు.