మూవీ రివ్యూ : “లక్ష్మీస్ ఎన్టీఆర్”

SMTV Desk 2019-03-29 10:46:22  Laksmis NTR,

సాధారణంగా ఎవరైనా దర్శకుడు మాది కుటుంబ కథా చిత్రం అని చెప్పి తన సినిమాని ప్రమోట్ చేసుకుంటారు.కానీ ఎప్పుడూ వివాదాలతో గడిపే రామ్ గోపాల్ వర్మ మాత్రం తాను తీసింది ఒక “కుటుంబ కుట్రల చిత్రం”అని ముందు గానే చెప్పేసాడు.స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి జీవిత చరిత్రలో ఎవ్వరు చూపించని కోణాన్ని చూపించబోతున్నానని ఒక సంచలన సబ్జెక్టు పట్టుకున్నారు.ఎన్టీఆర్ నిజజీవితంలో తన అల్లుడు చంద్రబాబు నాయుడు ఎలా వెన్నుపోటు పొడిచారో అన్న కథాంశం అని చెప్పగానే ఈ సినిమాపై అంచనాలు పెరిగిపోయాయి.ఎన్నో అవాంతరాల మధ్య ఈ సినిమా ఈ రోజే విడుదలయ్యింది.మరి ఈ సినిమాతో వర్మ మరియు అగస్త్య మంజు సంయుక్తంగా దర్శకత్వం వహించిన ఈ సినిమా అంచనాలను అందుకుండా లేదా అన్నది ఇప్పుడు సమీక్ష లోకి వెళ్లి తెలుసుకుందాం రండి.

కథ :

కథలోకి వెళ్లినట్టయితే 1989 ఎన్నికలలో విజయ్ కుమార్(ఎన్టీఆర్) ఘోర పరాజయం చూసిన తర్వాత ఎన్టీఆర్ జీవితంలోకి తన జీవిత చరిత్ర రాస్తానంటూ యజ్ఞ శెట్టి(లక్ష్మీ పార్వతి) వస్తారు.అలా ఆ ఇద్దరి మధ్య బంధం ఏర్పడి అది పెళ్ళికి దారి తీస్తుంది.ఈ నేపథ్యంలో ఆమె ఎన్టీఆర్ జీవితంలోకి రావడం వలన లక్ష్మీ పేరు వారి పార్టీలో ఎక్కువగా వినిపించడంతో ఎన్టీఆర్ అల్లుడు చంద్రబాబు(శ్రీతేజ్) ఎన్టీఆర్ కుటుంబీకులతో కలిసి పార్టీని తన ఆధీనంలోకి తెచ్చుకుందామని చూస్తారు,ఈ నేపథ్యంలో జరిగిన అసలు కథ ఏమిటి? అది ఎన్టీఆర్ మరణానికి ఎలా దారి తీసింది,ఈ అన్ని అంశాలను తెలుసుకోవాలంటే ఈ సినిమాను వెండి తెరపై చూడాల్సిందే.

విశ్లేషణ :

టాలీవుడ్ లో బయోపిక్ ల పరంపర కొనసాగుతున్న నేపథ్యంలో దర్శకుడు రామ్ గోపాల్ వర్మ అప్పటికే ఎన్టీఆర్ జీవిత చరిత్రపై మరో దర్శకుడు సినిమా తీసేసినా..తాను ఎవ్వరు చూపించని నిజాన్ని మించిన యాదార్ధాన్ని చూపిస్తానని ఛాలెంజ్ చేసారు.అలా ఛాలెంజ్ చేసి “లక్ష్మీస్ ఎన్టీఆర్”సినిమా తీశారు.ఈ సినిమా మొదలు కావడమే ఎన్టీఆర్ గత జీవితానికి సంబంధించిన ఫోటోలను చూపిస్తూ వర్మ మార్క్ లో టైటిల్ కార్డ్స్ పడడంతో మొదట్లోనే ఆసక్తి మొదలవుతుంది.లక్ష్మీ పార్వతి వల్ల కుటుంబంలో మరియు పార్టీలో పుట్టిన పుకార్లు,అంతర్గత గొడవలు వర్మ మరియు అగస్త్యలు చాలా రియలిస్టిక్ గా తీశారు అని చెప్పాలి.వర్మ మరియు అగస్త్యలు తాము అనుకున్నదాన్ని డైరెక్ట్ గా చూపించడంలో ఎలాంటి గోప్యం హడావుడి లేకుండా సూటిగా సుత్తి లేకుండా ఇద్దరు దర్శకులు సఫలం అయ్యారని చెప్పొచ్చు.

కాకపోతే ఫస్టాఫ్ ముగిసే సరికి సినిమా అక్కడక్కడా సాగదీతగా సాగినట్టు ఒక్కోసారి ఆసక్తికరంగా ఇలా పడి లేచినట్టు చూసే ప్రేక్షకుడికి అనిపిస్తుంది.ఇంటర్వెల్ లో లక్ష్మీ పార్వతిని పెళ్లి చేసుకుంటాను అని ఇచ్చే ప్రకటన ఫస్టాఫ్ లో ఒక ప్రధాన ఆకర్షణ అని చెప్పొచ్చు.ఆ తర్వాత సెకండాఫ్ లో ఏం జరుగుతుందా అన్న కుతూహలం ప్రేక్షకులకి కలుగుతుంది.ఇదంతా బాగానే ఉంది కాకపోతే సందర్భానుసారం వచ్చే పాటలు పర్వాలేదనిపిస్తాయి,అక్కడక్కడా చిత్రం నెమ్మదిగా సాగిన భావన అయితే కలుగుతుంది.1990 కాలంలో నేటివిటీ ఎలా ఉంటుందో దానికి తగ్గట్టుగా రమ్మీ అందించిన సినిమాటోగ్రఫీ కూడా బాగుంటుంది.

ఈ సినిమాకి కీలకమైన ఎపిసోడ్లు అన్ని సెకండాఫ్ లో పెట్టి ఇద్దరు దర్శకులు మంచి పని చేసారని చెప్పాలి.దాని వలన సినిమా చూసే ప్రేక్షకులకి తాము ట్రైలర్ లో చూసిన ఎన్టీఆర్ నిజజీవితంలో ఒక మచ్చుతునకగా మిగిలిపోయిన సన్నివేశాలు ఎలా ఏ సందర్భం వలన ఎందుకు వచ్చాయో అన్న ఆత్రుత కలుగుతుంది,ఆ సన్నివేశాలను వర్మ మరియు అగస్త్యలు చక్కగా బ్యాలన్సుడ్ గా తీర్చిదిద్దారు.ఇక సెకండాఫ్ లో ఎన్టీఆర్ కి బాబు వెన్నుపోటు పొడిచే ఎపిసోడ్ అలాగే అత్యంత కీలక ఘట్టమైనటువంటి వైస్రాయ్ ఎపిసోడ్ లు చివర్లో ఎన్టీఆర్ మరణానంతరం నిజమైన ఎన్టీఆర్ పార్థివదేహాన్ని చూపించే సీన్లు ప్రధాన హైలైట్ అని చెప్పొచ్చు.

ఇక నటీనటుల విషయానికి వచ్చినట్టయితే రామ్ గోపాల్ వర్మకి నూటికి నూరు శాతం మార్కులిచ్చినా తప్పు లేదు,ఈ సినిమాకి అత్యంత కీలకమైన పాత్రలైనటువంటి ఎన్టీఆర్ అలాగే చంద్రబాబు పాత్రలకి చాలా సహజంగా దగ్గర పోలికలు ఉన్న నటుల్ని తీసుకోవడం సినిమాకి పెద్ద ప్లస్ అని చెప్పొచ్చు.అలాగే ఎన్టీఆర్ పాత్రలో విజయ్ కుమార్ నటన మరియు చంద్రబాబు పాత్రలో శ్రీతేజ్ లు కనబర్చిన నటన అద్భుతమనే చెప్పాలి.అలాగే లక్ష్మీ పార్వతిగా యజ్ఞ శెట్టి మంచి నటన కనబర్చారు.పార్టీలో మారుతున్న సమీకరణాలు చూసి లోలోపల రగిలిపోయే వ్యక్తిగా శ్రీతేజ్ తన ముఖ కవలికలతోనే అద్భుత నటనను ప్రదర్శించారు.అలాగే మిగతా పాత్రలు అయినటువంటి బాలకృష్ణ మరియు దివంగత హరికృష్ణ పాత్రలకు కూడా వర్మ మరియు అగస్త్యలు దగ్గర పోలికలు ఉండే వ్యక్తులను తీసుకోవడం వలన సినిమాలో మరింత సహజత్వం కనిపిస్తుంది.

ప్లస్ పాయింట్స్ :

కథనంలో కనిపించే సహజత్వం
బ్యాక్గ్రౌండ్ స్కోర్

మైనస్ పాయింట్స్ :

అక్కడక్కడా సాగదీతగా అనిపించే కథనం
లక్ష్మీ పార్వతినే ఎక్కువ హైలైట్ చెయ్యడం

Rating : 2.5/5