పెద్ద నోట్ల రద్దులో అవినీతి

SMTV Desk 2019-03-28 11:28:18  corruption, not ban

పెద్ద నోట్ల రద్దు పేరుతో బీజేపీ నాయకులు అవినీతికి పాల్పడ్డారంటూ కాంగ్రెస్ సీనియర్ నేత కపిల్ సిబాల్ మంగళవారం మీడియా సమావేశంలో ఓ వీడియోను విడుదల చేశారు. దీనిపై కేంద్ర రక్షణ మంత్రి నిర్మలా సీతారామన్ స్పందించారు. బుధవారం మీడియా సమావేశంలో మాట్లాడిన ఆమె కాంగ్రెస్‌పై చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. ఎన్నికల్లో లబ్ధిపొందడానికే ఫేక్ వీడియోను విడుదల చేశారని కాంగ్రెస్ నేతలపై మండిపడ్డారు. వీడియోకు సంబంధించిన వ్యవహారంపై బీజేపీ న్యాయసలహా తీసుకుంటోందని, కాంగ్రెస్ పార్టీ నేతలతో సహా దీనితో సంబంధం ఉన్న వారందరిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఆమె హెచ్చరించారు.

వీడియోను విడుదల చేయడం ద్వారా బీజేపీ ప్రతిష్టను దెబ్బతీయలేరని సీతారామన్ ధీమా వ్యక్తం చేశారు. పెద్ద నోట్ల రద్దు తర్వాత.. ఓ బీజేపీ నేత పాత నోట్ల మార్పిడి దందాకు పాల్పడ్డాడని కాంగ్రెస్ ఆరోపించింది. సదరు నాయకుడు 40% కమీషన్ తీసుకుని, పాత నోట్లను మార్చారని ఆరోపించింది. దీనికి సంబంధించి కొందరు జర్నలిస్ట్‌లు అహ్మదాబాద్‌లో చేసిన స్టింగ్ ఆపరేషన్ తాలూకు వీడియోను విడుదల చేసింది.