ఏపీ సీఎం చంద్రబాబు సీఈసీకి లేఖ

SMTV Desk 2019-03-28 11:24:39  ap cm, chandrababu,

ఏపీలోని పోలీసు ఉన్నతాధికారుల బదిలీల వి‍షయంలో కేంద్ర ఎన్నికల సంఘం తీరును తప్పుబడుతూ.. ఏపీ సీఎం చంద్రబాబు లేఖ రాశారు. వైసీపీ ఫిర్యాదును తీసుకొని అలా ఎలా బదిలీలు చేస్తారని ఆయన లేఖలో పేర్కొన్నారు. కనీసం ప్రాధమిక విచారణ కూడా చేయకుండానే 24 గంటల్లో చర్యలు ఎలా తీసుకుంటారని ఆయన ప్రశ్నించారు. అసలు బదిలీకు గల కారణాలు కూడా చెప్పకుండా అలా చేయడం సరికాదని అన్నారు. అప్రజాస్వామికంగా ఎన్నికలు జరిగేలా ఈసీ వ్యవహరిస్తోందని చంద్రబాబు ఈసీకి రాసిన లేఖలో పేర్కొన్నారు.

అదేవిధంగా... ఇంటెలిజెన్స్ డీజీ ఎన్నికల విధుల పరిధిలోకి రాదని.. ఎన్నికల విధుల పరిధిలోకి రాని ఇంటెలిజెన్స్ డీజీని ఎలా బదిలీ చేస్తారని ఆయన పేర్కొన్నారు. ఫేజ్-1లో ఏపీ ఎన్నికలు రావడంతో సమస్యాత్మక ప్రాంతాల్లో టీడీపీ ప్రచారం చేయాల్సి వస్తోందని వివరించారు. ఇలాంటి సమయంలో పోలీసు ఉన్నతాధికారుల బదిలీ దుర్మార్గమైన చర్యగా ఆయన తెలిపారు. మోడీ-జగన్-కేసీఆర్ ఈ కుట్రలకు కారణమని వివరించారు.

అంతేకాకుండా సాధారణ బదిలీల్లో భాగంగానే వెంకట రత్నం శ్రీకాకుళం జిల్లాకు బదిలీ అయ్యారని వివరించారు. వివేకా హత్య కేసులో కడప ఎస్పీ చాలా ఖచ్చితత్వంతో వ్యవహరిస్తున్నారని తెలిపారు. కడప ఎంపీ అవినాష్ రెడ్డి వివేకా హత్య కేసు సాక్ష్యాలు తుడిచేయడంలో కీలకంగా వ్యవహరించారని ఆయన తెలిపారు. ఈ కీలక సమయంలో కడప ఎస్పీ బదిలీ వెనుక కారణాలేంటీ..? ఈసీకి ఫిర్యాదు చేసిన విజయసాయిపై ఈడీ కేసులు.. వైసీపీ అధినేతపై 31 కేసులున్నాయి. ఇలాంటి వ్యక్తులిచ్చిన ఫిర్యాదుపై ఎలాంటి విచారణ లేకుండా చర్యలెలా తీసుకుంటారు..? ఫారం-7 దరఖాస్తుల దుర్వినియోగం విషయంలో వైసీపీపై మేం ఇచ్చిన ఫిర్యాదును ఈసీ పట్టించుకోలేదు. ఈసీ తాము పేర్కొన్న నిర్ణయాలన్ని సమీక్షించి... బదిలీలను వెనక్కు తీసుకోవాలని చంద్రబాబు సీఈసీకి రాసిన లేఖలో వివరించారు.