రాహుల్ తెలంగాణ పర్యటన షెడ్యూల్

SMTV Desk 2019-03-28 11:19:32  rahul gandhi, telangana,

కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్ గాంధీ త్వరలో తెలంగాణలో పర్యటించబోతున్నారు. పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆయన పర్యటన షెడ్యూల్‌ను నిన్న గాంధీభవన్‌లో ప్రకటించారు. ఏప్రిల్ 1వ తేదీన రాహుల్ గాంధీ వరుసగా మూడు బహిరంగసభలలో పాల్గొంటారు. మధ్యాహ్నం 12గంటలకు జహీరాబాద్, 2 గంటలకు వనపర్తి, సాయంత్రం 4గంటలకు హుజూర్‌నగర్‌లో జరిగే బహిరంగసభలలో పాల్గొంటారని ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు.

ఉత్తమ్ కుమార్ రెడ్డి నల్గొండ నుంచి లోక్‌సభకు పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. ఎన్నికల ప్రచారం కోసం జిల్లాలోని హాలియా మండలంలో పర్యటించిన మీడియాతో మాట్లాడుతూ, “మూడు నెలల క్రితం ఈవీఎంలతో నిర్వహించిన అసెంబ్లీ ఎన్నికలలో తెరాస ఘనవిజయం సాధించగా మా అభ్యర్ధి జీవన్ రెడ్డి ఓడిపోయారు. ఇప్పుడు అదే జీవన్ రెడ్డి బ్యాలెట్ పేపర్లతో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికలలో గెలిచారు. ఈవీఎంలతో ఎన్నికలు నిర్వహిస్తే భారీ మెజార్టీతో విజయం సాధించే తెరాస బ్యాలెట్ పేపర్లతో ఎన్నికలు జరిగితే ఓడిపోతుంటుంది ఎందుకు? అంటే ఈవీఎంలలో ఏదో మాయ జరుగుతోందని స్పష్టం అవుతోంది. ఎమ్మెల్సీ ఎన్నికలలో పట్టభద్రులు, ఉపాధ్యాయులు, మేధావులు తెరాసను నిర్ద్వందంగా తిరస్కరించారు. లోక్‌సభ ఎన్నికలలో కూడా ప్రజలు తెరాసకు గుణపాఠం చెప్పబోతున్నారు,” అని ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు.