చంద్రబాబు పేదలను హామీలతో మోసం చేస్తున్న దుర్మార్గుడు: జగన్

SMTV Desk 2017-08-12 13:46:33  YS Jagan, YSRCP, Namdyala by-polls, TDP, Chandrababu Naidu

నంద్యాల, ఆగస్ట్ 12: నంద్యాల ఉపఎన్నికల ప్రచారంలో అధికార పార్టీపై రోజుకో విధమైన వ్యాఖ్యలు చేస్తున్న వైసీపీ అధినేత జగన్ తాజాగా నేడు ప్రచారంలో భాగంగా ఒంటివెలగలలో రోడ్ షో సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ... రాజకీయ నాయకులు ఎవరైనా సరే, ఇచ్చిన మాటను తప్పితే కాలర్ పట్టుకుని నిలదీయాలని ఆయన అన్నారు. ఇప్పటి వరకు టీడీపీ చెందిన ప్రధాన నాయకులెవరు నంద్యాలవైపు రాలేదు. ఇప్పుడు ఉపఎన్నికలు జరుగుతుండటంతో వారంతా నంద్యాలలో రెక్కలు కట్టుకుని మరీ వాలిపోయారని జగన్ ఎద్దేవా చేశారు. బాబు పేదలను తన హామీలతో మోసం చేస్తున్న దుర్మార్గుడు అని ఆయన ఆరోపించారు. నంద్యాలపై ఏపీ ముఖ్యమంత్రికి ప్రత్యేక ప్రేమ ఏమీ లేదని, ఉపఎన్నికలు రావడంతో ప్రేమ పుట్టుకు వచ్చిందని ఆయన విమర్శించారు. ఉప ఎన్నిక వచ్చేసరికి చంద్రబాబు బెంబేలెత్తి పోయారని, ఈ ఎన్నికల్లో వైసీపీ పోటీకి దిగింది కనుక ఇక్కడ చంద్రబాబు కనిపిస్తున్నారని అన్నారు. ఎండను సైతం లెక్క చేయకుండా తన కోసం వచ్చి ప్రేమను, ఆప్యాయతను చూపిస్తున్నందుకు ధన్యవాదాలు చెబుతున్నానని అన్నారు. ఓట్ల కోసం చంద్రబాబు వస్తే, ఇచ్చిన హామీలను ఎందుకు అమలుచేయలేదని కాలర్ పట్టుకుని నిలదీయండని పిలుపునిచ్చారు.