ఫెడరల్‌ ఫ్రంట్‌ భాగస్వాములు ఏపీ సిఎంకు మద్దతు!

SMTV Desk 2019-03-27 11:16:54  AP Cm, federal front, cm kcr

సిఎం కేసీఆర్‌ ఫెడరల్‌ ఫ్రంట్‌ ఏర్పాటు కోసం సంప్రదించిన నేతలు ఇప్పుడు ఏపీ సిఎం చంద్రబాబునాయుడుకు మద్దతుగా ఎన్నికల ప్రచారానికి తరలివస్తుండటం విశేషం. పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, కర్ణాటకలోని జెడిఎస్ అధినేత హెడి దేవగౌడ, తమిళనాడులోని డిఎంకె పార్టీ అధినేత స్టాలిన్ త్వరలో ఆంధ్రప్రదేశ్‌కు వచ్చి టిడిపి తరపున చంద్రబాబునాయుడుకు మద్దతుగా ఎన్నికల ప్రచారంలో పాల్గొనబోతున్నారు. జమ్ముకశ్మీర్‌ మాజీ సిఎం ఫరూక్ అబ్దుల్లా ఇప్పటికే ఆంధ్రాకు వచ్చి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. డిల్లీ సిఎం అరవింద్ కేజ్రీవాల్ కూడా త్వరలో ఏపీకి వచ్చి టిడిపికి మద్దతుగా ఎన్నికల ప్రచారంలో పాల్గొనబోతున్నారు.

ఇటీవల కోల్‌కతాలో మమతా బెనర్జీ నిర్వహించిన ర్యాలీకి చంద్రబాబు చాలా సహకరించారు. కనుక ఆమె బాబుకు మద్దతుగా ఈనెల 31న ఏపీలో ఎన్నికల ప్రచారానికి వస్తున్నారు. కర్ణాటకలో జెడిఎస్-కాంగ్రెస్‌ సంకీర్ణ ప్రభుత్వం నడుస్తోంది. కనుక కాంగ్రెస్‌తో కలిసిపనిచేస్తున్న చంద్రబాబుకు మద్దతు పలికేందుకు దేవగౌడ ఇస్తున్నారు. అలాగే తమిళనాడులో కాంగ్రెస్‌-డిఎంకెలు పొత్తులు పెట్టుకొన్నాయి. కనుక స్టాలిన్ కూడా చంద్రబాబుకు మద్దతుగా ప్రచారానికి వస్తున్నారు. డిల్లీ సిఎం కేజ్రీవాల్, ఫరూక్ అబ్దుల్లా కూడా మోడీని, బిజెపిని తీవ్రంగా వ్యతిరేకిస్తుంటారు. వారిరువురితో చంద్రబాబుకు మంచి స్నేహం ఉంది కనుక వారిరువురూ కూడా ఆయనకు మద్దతుగా ప్రచారానికి వస్తున్నారు.

ముస్లింలు ఎక్కువగా ఉండే కడప, కర్నూలు జిల్లాలలో ఫరూక్ అబ్దుల్లా, కర్ణాటక సరిహద్దు జిల్లా అనంతపురంలో దేవగౌడ, తమిళనాడు సరిహద్దు జిల్లాలైన చిత్తూరు, నెల్లూరులో స్టాలిన్, ఉత్తరాదివారు ఎక్కువగా స్థిరపడిన విశాఖలో అరవింద్ కేజ్రీవాల్, మమతా బెనర్జీలతో ఎన్నికల ప్రచారం నిర్వహించాలని చంద్రబాబునాయుడు ప్లాన్ చేశారు. ప్రస్తుతం వీరందరూ బాబు తరపున టిడిపి కోసం ప్రచారంలో పాల్గొంటున్నప్పటికీ లోక్ సభ ఎన్నికల తరువాత వీరిలో ఎవరు ఎటువైపు నిలబడతారో చూడాలి.