ఆరేళ్ల చిన్నారి ప్రవళికకు ఘన నివాళి

SMTV Desk 2019-03-27 10:48:25  pravalika rape and murder rally in moulali, child rape

హైదరాబాద్, మార్చ్ 26: ఆరేళ్ల చిన్నారి ప్రవళికపై అతి ఘోరంగా అత్యాచారం చేసి హత్య చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ దారుణానికి పాల్పడ్డ నిందుతుడిని కఠినంగా శిక్షించాలని నేషనల్ ఫోరం ఫర్ సోషల్ జస్టిస్ ( ఎన్‌ఎఫ్‌ఎఫ్ ఎస్‌జె) తెలంగాణ రాష్ట్ర మహిళా కమిటీ డిమాండ్ చేసింది. ఈ సందర్భంగా ఆ సంఘం ఆధ్వర్యంలో సోమవారం రాత్రి మౌలాలిలో నిరసన వ్యక్తం చేశారు. మౌలాలి చౌరస్తా, అంబేద్కర్ విగ్రహం, యునాని చౌరస్తా, ఎస్‌పీనగర్‌ల మీదుగా నిరసన ప్రదర్శన చేశారు. కళ్లకు గంతలు కట్టుకొని తమ నిరసనను వ్యక్తం చేశారు. మృతురాలు ప్రవళిక చిత్ర పటానికి పూల మాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఆ సంఘం జాతీయ అధ్యక్షులు నెల్లి గురుదేవ్‌జీ, టిఎస్ మహిళా అధ్యక్షురాలు తిరునగిరి భవాని ప్రసాద్, టిఎస్ ఎస్టీ ఉమెన్ వింగ్ అధ్యక్షురాలు ఎన్న విద్యారాణిలు మాట్లాడుతూ.. ఆరేళ్ల చిన్నారిపై హత్యోదంతాన్ని తమ సంఘం తీవ్రంగా ఖండిస్తుందన్నారు. నిర్భయ చట్టం ఉన్నా మానవ మృగాల చెరలో చిక్కి చిన్నారులు బలై పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి ఘటనలలో నిందుతులను విచారణ పేరుతో కాలయాపన చేయకుండా కఠినంగా శిక్షించి, బాధితులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. చిన్నారి బాలికలు, యువతులు, మహిళలపై ఆఘాయిత్యాలు రోజు రోజకు పెరిగిపోతున్నాయని వాపోయారు. ఈ కార్యక్రమంలో జాతీయ మైనారిటీ మహిళా విభాగం ప్రధాన కార్యదర్శి షబనా బేగం, జె. లక్ష్మీ, టిఎస్ ఒబిసి మహిళా విభాగం కార్యదర్శి బుడుగు మాధవి, టిఎస్ మైనార్టీ విభాగం గౌరవ అధ్యక్షులు ఎంఎ షరీఫ్, అధ్యక్షులు మహ్మద్ ఉస్మాన్, సీనియర్ సిటిజన్ అధ్యక్షుడు శరత్‌చంద్ర, ఇంద్ర, స్వాతిగౌడ్ తదితరులు పాల్గొన్నారు.