ఉద్రిక్తతలను మరింత పెంచొద్దు..రష్యాకు అమెరికా వార్నింగ్

SMTV Desk 2019-03-27 10:24:06  russia, america, Venezuela, russia army

మాస్కో, మార్చ్ 26: అమెరికా, రష్యా దేశాల మధ్య విబేధాలు ఆకాశాన్నంటుతున్నాయ్. తాజాగా రష్యన్ బలగాలు వెనిజులాలో అడుగుపెట్టడంతో అమెరికా వెనిజులాలో ఉద్రిక్తతలను మరింత పెంచొద్దని రష్యాకు సూచించింది. శనివారం రష్యన్ ఎయిర్‌ఫోర్స్‌కు చెందిన రెండు కార్గో విమానాలు, ఒక చిన్న ఎయిర్‌క్రాఫ్ట్ వెనిజులాలోని సిమోన్ బొలీవర్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టుకు చేరుకున్నాయి. వాటిలో రష్యా సైనిక బలగాలతో పాటు 35 టన్నుల మిలటరీ ఎక్విప్‌మెంట్ కూడా తీసుకొచ్చింది. ఈ విషయాన్ని రష్యా అధికార పత్రిక స్పుత్నిక్ కూడా ధ్రువీకరించింది. అయితే ఇరు దేశాల మధ్య ఉన్న టెక్నికల్ మిలటరీ కాంట్రాక్ట్‌లో భాగంగానే రష్యా బలగాలను పంపిందే తప్ప ఇందులో రహస్యమేమీ లేదని స్పష్టం చేసింది. అయితే ఈ పరిణామాలపై యూఎన్ సెక్రటరీ ఆఫ్ స్టేట్ మైక్ పాంపియో, రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్‌తో ఫోన్‌లో మాట్లాడారు. రష్యా దుందుడుకు చర్యల్ని మానుకోవాలని, వెనిజులాలో ఉద్రిక్తలను మరింత పెంచవద్దని అమెరికా సూచించినట్లు తెలుస్తోంది. అయితే రష్యా అధికారిక పత్రిక స్పుత్నిక్ మాత్రం అమెరికా నుంచి ఫోన్ వచ్చిన మాట వాస్తవమేనని, అయితే బలగాలకు సంబంధించిన అంశంపై ఎలాంటి చర్చలు జరగలేదని స్పష్టం చేసింది.