నా ఓటమికి డికె అరుణే కారకురాలు

SMTV Desk 2019-03-26 18:37:51  jaipal,

ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లాలో జైపాల్ రెడ్డి, డికె అరుణ ఇద్దరూ ఇంతకాలం ఒకే పార్టీలో కలిసి పనిచేసినప్పటికీ ఇద్దరూ రాజకీయ శత్రువులుగానే వ్యవహరించేవారనే సంగతి జిల్లావాసులకు బాగా తెలుసు. జైపాల్ రెడ్డి తెర వెనుక చేస్తున్న కుట్రల కారణంగానే జిల్లాలో కాంగ్రెస్ పార్టీ బలహీనపడిందని డికె అరుణ తరచూ ఆరోపించేవారు. కానీ జైపాల్ రెడ్డి ఏనాడూ ఆమె విమర్శలకు బదులివ్వలేదు. ఆమెను బహిరంగంగా విమర్శించలేదు. ఆమె కాంగ్రెస్‌ను వీడి బిజెపిలో చేరిన తరువాత మొట్టమొదటిసారిగా జైపాల్ రెడ్డి ఆమెను విమర్శిస్తూ మాట్లాడారు.

సోమవారం మహబూబ్‌నగర్‌ లోక్‌సభ నియోజకవర్గం కాంగ్రెస్‌ విస్తృతస్థాయి సమావేశంలో మాట్లాడుతూ, “2014 ఎన్నికలలో కొడంగల్ నుంచి కాంగ్రెస్‌ అభ్యర్ధిగా పోటీ చేసిన గుర్నాధ్ రెడ్డి ఓటమికి, మహబూబ్‌నగర్‌ నుంచి లోక్‌సభకు పోటీ చేసిన నా ఓటమికి డికె అరుణే కారకురాలు. ఆనాడు ఆమె చేసిన ఈ కుట్రలను మనసులో దాచిపెట్టుకొని, ఇప్పుడు నాపైన విమర్శలు చేస్తున్నారు. ఆమె బిజెపిలో చేరి మహబూబ్‌నగర్‌ నుంచి పోటీ చేస్తే చేయవచ్చు. కానీ తన ఈ ఉన్నతికి కారణమైన కాంగ్రెస్ పార్టీపైన విమర్శలు చేయడం సరికాదు. రాష్ట్రంలో బిజెపి పరిస్థితి ఏమిటో అందరికీ తెలుసు. మహబూబ్‌నగర్‌తో సహా ఏ ఒక్క నియోజకవర్గంలో కూడా బిజెపి గెలువలేదని ఖచ్చితంగా చెప్పగలను,” అని అన్నారు.