వైసీపీ ఫ్యాన్‌కు స్విచ్ ఢిల్లీలో ఉంది, రెగ్యులేటర్ కేసీఆర్ చేతిలో ఉంది

SMTV Desk 2019-03-26 17:01:53  nara lokesh, kcr,

పలాస: శ్రీకాకుళం జిల్లా పలాసలో ఏపీ మంత్రి లోకేష్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా బహిరంగ సభలో మాట్లాడుతూ మోడీ, జగన్, కేసీఆర్ కలిసి మన సీఎం చంద్రబాబు గారిని ఓడించేందుకు ప్రయత్నిస్తున్నారని అన్నారు. కేసీఆర్‌కు ఇక్కడ ఒక్క ఓటు కూడా పడదని, అలాంటిది మనకే రిటర్న్ గిఫ్ట్ ఇస్తాడంటా అని మండిపడ్డారు. వైసీపీకి వెయ్యి కోట్ల రూపాయలను కేసీఆర్ పంపించారని, టీఆర్ఎస్ ప్రచార రధాలను కూడా పంపారని ఆరోపించారు.

తెలుగుదేశం పార్టీ అభ్యర్ధులకు కేటీఆర్ ఫోన్ చేసి నామినేషన్ ఉపసంహరించుకోవాలని, లేదంటే హైదరాబాద్‌లో ఉన్న భూముల విషయంలో ఇబ్బంది పెడతానంటూ భయపెడుతున్నారని లోకేష్ అన్నారు. ఏపీలో బలహీనంగా ఉన్న ముఖ్యమంత్రి వస్తే పోలవరాన్ని అడ్డుకోవచ్చు, ముంపు మండలాలను తిరిగి తీసుకోవచ్చని టీఆర్ఎస్ భావిస్తుందని లోకేష్ ఆరోపించారు.

వైసీపీ ఫ్యాన్‌కు స్విచ్ ఢిల్లీలో ఉంది, రెగ్యులేటర్ కేసీఆర్ చేతిలో ఉందని లోకేష్ విమర్శించారు. ఇక్కడున్న వైసీపీ కార్యకర్తలకు సిగ్గు, శరం ఉంటే కేటీఆర్‌తో జగన్‌ ఎందుకు కలుస్తున్నారో ప్రశ్నించాలని అడిగారు. ఆంధ్రుల్ని రాక్షసులన్నారు, తరిమి కొట్టాలన్నారు, మనం తినే తిండిపై కూడా ఎగతాళి చేశారు. అలాంటి టీఆర్ఎస్‌తో పొత్తు పెట్టుకుంటే తప్పేంటని జగన్ ఎలా అంటారంటూ లోకేష్ మండిపడ్డారు.