కేసీఆర్‌ మద్దతిస్తున్నది మాకా? ప్రత్యేక హోదాకా?

SMTV Desk 2019-03-26 13:06:22  Jagan, KCR,

కేసిఆర్ తో అవగాహనపై తొలిసారి బయటపడ్డారు వైసీపీ అధినేత జగన్. కేసీఆర్ తో కలిసి చేసిన తప్పేమిటని ప్రశ్నించిన జగన్ కెసిఆర్ 17 సీట్లు, మన 25 సీట్లు ఉంటె కలిసి పని చేసి రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తామని ప్రకటించారు. కేసీఆర్‌ మద్దతు తీసుకుంటే అభ్యంతరం ఏమిటని ప్రశ్నించారు. సోమవారం ఆయన తాడిపత్రి సభలో కేసీఆర్‌ అంశాన్ని ప్రస్తావించారు. ‘‘కేసీఆర్‌ మద్దతిస్తున్నది మాకా? ప్రత్యేక హోదాకా? ఏపీకి ప్రత్యేక హోదాకు ఆయన మద్దతిస్తుంటే... చంద్రబాబు ఎందుకు అభ్యంతరం? జాతీయ స్థాయిలో ఒక రాష్ట్రానికి ఇంకో రాష్ట్రం తోడుగా ఉంటే రాష్ట్రాల హక్కులు కాపాడుకోవచ్చు. ఫెడరల్‌ ఫ్రంట్‌ ఏర్పాటు చేసి, కేంద్రంపై ఒత్తిడి తెచ్చి, రాష్ట్రాల సమస్యలు పరిష్కరించేందుకు ఇంకా, మన రాష్ట్రానికి సంబంధించి ప్రత్యేక హోదాకు కేసీఆర్‌ మద్దతు పలికారు.

దానికి హర్షించాల్సిందిపోయి సిగ్గుమాలిన విధంగా మాట్లాడటం ధర్మమేనా ?’’ అని చంద్రబాబుపై ధ్వజమెత్తారు. రాష్ట్రంలో ఉన్న 25మంది ఎంపీలకు తెలంగాణలోని 17 మంది జత అయితే, మొత్తం 42 మంది ఎంపీలు ఒకేతాటిపైకి వచ్చి ప్రత్యేక హోదాకోసం మద్దతిస్తే... హర్షించాల్సిందిపోయి, దిక్కుమాలిన రాజకీయాలు చేస్తావా అని చంద్రబాబును ప్రశ్నించారు. టీఆర్‌ఎస్ తో పొత్తుకు టీడీపీ ప్రయత్నించలేదా అని నిలదీశారు. అంతేకాక కేసీఆర్ వెయ్యో కోట్లు ఇచ్చారని బాబు చేసిన వ్యాఖ్యల మీద స్పందించిన జగన్ ‘కేసీఆర్‌ వెయ్యి కోట్లు ఇవ్వడం మీరు చూశారా? లేక... కేసీఆర్‌ మీకు ఫోన్‌ చేసి చెప్పారా?’ అని ప్రశ్నించారు. తన చిన్నాన్న చంద్రబాబు చంపించారని, తన పోలీసుల చేతే దర్యాప్తు చేయిస్తే నిజాలు ఎలా బయటకు వస్తాయని జగన్‌ ప్రశ్నించారు. చంద్రబాబు పాలనపై చర్చ జరిగితే ఎన్నికల్లో అభ్యర్థులకు డిపాజిట్లు రావు. అందుకే రోజుకో జిమ్మిక్కు చేస్తున్నారు. కొత్త పార్టీలు పుట్టిస్తూ వైసీపీని పోలిన కండువాలు, గుర్తులతో ఓట్లు చీల్చే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు