మెగాస్టార్ ను ఎందుకు లాగుతారు

SMTV Desk 2019-03-26 11:19:01  megastar, chiranjeevi,

ఎన్నికల తేది సమీపిస్తోన్న వేళ ఏపీలో ప్రచారాన్ని ముమ్మరం చేశాయి అన్ని పార్టీలు. ఒకరి వైఫల్యాలను మరొకరు ఎండగడుతూ ప్రచారాల్లో పోటీ పడుతున్నారు అభ్యర్థులు. అయితే ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్న జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఇటీవల తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై కామెంట్లు చేశారు. దీంతో ఏపీ ఎన్నికల వేడి కాస్త తెలంగాణాకు అంటుకుంది. ఈ నేపథ్యంలో పవన్ కల్యాణ్‌పై కామెంట్లు చేస్తోన్న కొంతమంది ఈ వివాదంలోకి ఆయన సోదరుడు చిరంజీవిని కూడా లాగుతున్నారు. దీనిపై ప్రముఖ నిర్మాత, చిరు సన్నిహితుడు ఠాగూర్ మధు ఫైర్ అయ్యారు.

ఈ మేరకు ట్విట్టర్‌లో మధు ఓ ట్వీట్ చేశారు. ‘‘మీ రాజకీయాలు మీరు చేసుకోండి. క్రమశిక్షణకు మారుపేరైన మెగాస్టార్‌ను ఎందుకు లాగుతారు. మౌనంగా ఉన్న కేసీఆర్ ఊసేందుకు. భావ వ్యక్తీకరణ మాత్రమే కాదు భాష కూడా ముఖ్యం’’ అని మర్చిపోకండి అంటూ ఆయన కామెంట్ చేశారు. ఇక ఈ వ్యాఖ్యలు పవన్ కల్యాణ్‌ కూడా వర్తిస్తాయంటూ ఆయన పరోక్షంగా చెప్పారని కొంతమంది అభిప్రాయపడుతున్నారు. ఇదిలా ఉంటే సినిమాలలో రీ ఎంట్రీ ఇచ్చిన చిరంజీవి గత కొన్ని సంవత్సరాలుగా రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. ఈ నేపథ్యంలో ఈ ఎన్నికలకు దూరంగా ఉండాలనుకుంటోన్న చిరు, ‘సైరా’ షూటింగ్ పేరుతో చైనాకు వెళ్లనున్నట్లు తెలుస్తోంది