‘లక్ష్మీస్ ఎన్టీఆర్’కు లైన్ క్లియర్

SMTV Desk 2019-03-25 17:38:14  Lakshmis NTR, Ramgopal varma, Lakshmi parvati, election commission

హైదరాబాద్, మార్చ్ 25: సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ సీనియర్ ఎన్టీఆర్ గారి జీవితాధారంగా తెరకెక్కిస్తున్న సినిమా ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’. ఈ సినిమాకు తాజాగా ఎన్నికల సంఘం పచ్చ జెండా ఊపింది. ఈ సినిమా ఎన్నికల నిబంధనలకు వ్యతిరేకంగా ఉందంటూ వచ్చిన ఆరోపణలపై చిత్ర నిర్మాత రాకేశ్ రెడ్డి సోమవారం ఈసీ అధికారుల ఎదుట హాజరయ్యారు. ఈ సందర్బంగా ఈసీ అడిగిన అన్ని ప్రశ్నలకు రాకేశ్ రెడ్డి సమాధానం ఇచ్చారు. విచారణ అనంతరం నిర్మాత రాకేశ్ రెడ్డి సినిమా విడుదల తేదీని ప్రకటించారు. ఈనెల 29వ తేదీన లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రాన్ని విడుదల చేస్తున్నామని, ఆ తర్వాత ఏమైన అభ్యంతరాలు ఉన్నా.. తాను మళ్లీ వివరణ ఇవ్వడానికి సిద్ధమని తెలిపారు. ‘నాకు వైఎస్ జగన్‌తో ఎలాంటి బంధుత్వమూ లేదు. కేవలం పార్టీ అధినేతగా మాత్రమే పరిచయం. లక్ష్మీస్ ఎన్టీఆర్ రాసిన పుస్తకం ఆధారంగా మాత్రమే ఈ సినిమా నిర్మించాం’ అని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో సార్వత్రిక ఎన్నికల జరగనున్న నేపథ్యంలో ఈ సినిమాను విడుదల చేయనుండటంతో దీనిపై తెలుగుదేశం పార్టీ అభ్యంతరాలు వ్యక్తం చేసింది. ఈ సినిమా అంతా చంద్రబాబుకు వ్యతిరేకంగా ఉంటుందని, ఇందులో చంద్రబాబును ఒక విలన్‌గా చూపించారంటూ టీడీపీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో ఎన్నికల సంఘం నోటీసులు నిర్మాత రాకేశ్ రెడ్డికి నోటీసులు జారీ చేసింది. తమకు ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ చిత్రాన్ని చూపించాలని ఈసీ ఆదేశించింది.