అతనికి మరిన్ని అవకాశాలిస్తూ ఎదగనిద్దాం : యువరాజ్

SMTV Desk 2019-03-25 17:15:12  ipl 2019, mi vs dc, rishab pant, yuvaraj singh

ముంబై, మార్చ్ 25: ఐపీఎల్ 2019 సీజన్‌లో వాంఖడే వేదికగా ముంబయి ఇండియన్స్‌తో ఢిల్లీ క్యాపిటల్స్ జట్ల మధ్య ఆదివారం రాత్రి జరిగిన మ్యాచ్‌లో ముంబై పరాజయ పాలయింది. ఇక ఈ మ్యాచ్ లో మెరుపు ఇన్నింగ్స్‌తో ఢిల్లీ క్యాపిటల్స్ యువ హిట్టర్ రిషబ్ పంత్ అందరి దృష్టి తనవైపు తిప్పుకున్నాడు. ఈ మ్యాచ్‌లో కేవలం 27 బంతుల్లోనే 7x4, 7x6 సా యంతో రిషబ్ పంత్ ఏకంగా 78 పరుగులు చేశాడు. దీంతో.. మొదట బ్యాటింగ్ చేసిన ఢిల్లీ జట్టు 6 వికెట్ల నష్టానికి 213 పరుగులు చేయగా.. ఛేదనలో తడబడిన ముంబయి జట్టు.. యువరాజ్ సింగ్ (53: 35 బంతుల్లో 5x4, 3x6) అర్ధశతకం సాధించినా 176 పరుగులకే పరిమితమైంది. మ్యాచ్‌కే హైలైట్‌గా నిలిచిన ఇన్నింగ్స్‌ ఆడిన రిషబ్ పంత్‌కి ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు లభించింది. రిషబ్ పంత్‌ హిట్టింగ్‌ గురించి తాజాగా యువరాజ్ సింగ్ మాట్లాడుతూ ‘ప్రపంచకప్ జట్టులోకి రిషబ్ పంత్ ఎంపిక గురించి నేను ఇక్కడ మాట్లాడటం లేదు. కానీ.. ముంబయిపై అతను చాలా అద్భుతంగా బ్యాటింగ్ చేశాడు. 2018 సీజన్‌లో చక్కగా రాణించిన పంత్.. గత ఏడాదికాలంగా టెస్టుల్లోనూ మెరుగ్గా ఆడుతున్నాడు. ముఖ్యంగా విదేశీ గడ్డ(ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా)పై టెస్టుల్లో రెండు సెంచరీలు సాధించాడు. ఇకపై అతడికి మరిన్ని అవకాశాలిస్తూ.. ఆశావాహ దృక్పథంతో ఎదగనిద్దాం. కచ్చితంగా అతను భారత్‌ తరఫున మంచి హిట్టర్ అవుతాడు’ అని విశ్వాసం వ్యక్తం చేశాడు.