సినీనటులకి కూడా రాజకీయ వేడి

SMTV Desk 2019-03-25 13:31:07  political , sukumar

సినీనటులకి కూడా రాజకీయ వేడి తగులుతోంది. ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల సమయం దగ్గరపడడంతో అన్ని పార్టీలు తమదైన శైలిలో ప్రచారం చేస్తూ దూసుకుపోతున్నాయి. సెగలు పుట్టిస్తున్న ఎండలను సైతం లెక్కచేయకుండా పార్టీ అభ్యర్దులు గ్రామ గ్రామాన ప్రచారం చేస్తున్నారు. తమ పార్టీకే ఓటేసి గెలిపించాలని అందరినీ కోరుతున్నారు. ముఖ్యంగా తమ నియోజకవర్గంలో ఉన్న ప్రముఖులను కలిసి వారి మద్దతు పొందే ప్రయత్నం చేస్తున్నారు. తాజాగా ప్రముఖ సినీ దర్శకుడు సుకుమార్‌ను తెలుగు దేశం పార్టి, జనసేన అభ్యర్థులు కలిశారు. సుకుమార్ ప్రస్తుతం తన స్వగ్రామంలోనే ఉన్నారు.

ఈ విషయం తెలుసుకున్న ప్రధాన పార్టీ అభ్యర్థులు ఆయన ఇంటికి వెళ్లి మద్దతివ్వాలని కోరుతుకున్నారు. తూర్పుగోదావరి జిల్లా మలికిపురం తాలూకా మట్టపర్రు(సుకుమార్ సొంత ఊరు)లో తెదేపా తరఫున పోటీచేస్తున్న గొల్లపల్లి సూర్యారావు, జనసేన తరఫున పోటీ చేస్తున్న రాపాక వరప్రసాద రావు ఆయననను వేర్వేరుగా కలిశారు. తమ పార్టీకి మద్దతు పలకాలని కోరారు. తమ పార్టీకి మద్దతిచ్చి ఓటేసి గెలిపించాలని కోరారు. ప్రధాన పార్టీల అభ్యర్థుల రాకతో సుకుమార్ నివాసం సందడిగా మారింది. త్వరలో వైసీపీ అభ్యర్ది కూడా వచ్చి మద్దతు కోరతారని తెలిసింది.