రైల్లో గొడుగు ఎందుకు?

SMTV Desk 2017-08-11 16:11:43  Train, umbrella, Loco pilot, Dhan badh railway, Railway minister

జార్ఖండ్‌, ఆగస్ట్ 11:ఇప్పటి వరకు వర్షాకాలంలో ప్రభుత్వ భవనాలకు తలెత్తే సమస్యలకు ప్రత్యామ్నాయ పాఠశాలలు, ప్రభుత్వ కార్యాలయాలు ఏర్పాటు చేయడం చూశాం. మరి రైలులో వర్షం కురిస్తే ఎలా అని ఆలోచించారా!. అసలు అలా ఎందుకు జరుగుతుంది అనుకుంటున్నారా. జార్ఖండ్‌లోని ధ‌న్‌బాద్ రైల్వేలో ఇలాంటి పరిస్థితే ఎదురైంది. వివరాల్లోకి వెళ్తే ధ‌న్‌బాద్ రైల్వేలో పనిచేస్తున్న డ్రైవర్ దుస్థితి ఇది. రైలు పైకప్పు బాలేక‌పోవ‌డంతో గొడుగు పెట్టుకుని రైలు న‌డుపుతున్న డ్రైవ‌ర్‌కు సంబంధించిన వీడియో ఇప్పుడు ఇంటర్నెట్‌లో హల్‌చల్ చేస్తుంది. అయితే గొడుగు తనకు రక్షణగా కాదని, రైలును నియంత్రించే కంట్రోల్ పానెల్ త‌డ‌వడ‌కుండా ఉండటం కోసమని ఆయన చెప్పారు. గత కొంత కాలం నుండి తన పై అధికారులకు ఫిర్యాదు చేస్తున్న ప్రయోజనం లేదని, ప్రతీ ఏడాది గొడుగుతో నెట్టుకొస్తున్నానని ఆ డ్రైవర్ తెలిపారు. ఓ మహిళ డ్రైవర్ పరిస్థితిని గమనించి వీడియో తీసి సామాజిక మాధ్యమ వేదికగా రైల్వే మంత్రి సురేశ్ ప్రభుకు తెలియజేసింది.