తెలుగులో మాట్లాడండి అని వెంకయ్యనాయుడు అనగానే నవ్వేసి...ఆప్షన్ ఉందా? : ఏచూరి

SMTV Desk 2017-08-11 13:54:51  Sitaram Yechuri, Venkaiah Naidu, Rajyasabha Chairman, New delhi

న్యూఢిల్లీ, ఆగస్ట్ 11: నేటి ఉదయం భారత ఉపరాష్ట్రపతిగా వెంకయ్యనాయుడు ప్రమాణస్వీకారం చేశారు. అనంతరం చైర్మన్ హోదాలో కూర్చొన్న ఆయనను ఉద్దేశించి మాట్లాడేందుకు కార్యదర్శి సీతారాం ఏచూరి ఇంగ్లీష్ లో మాటలు ప్రారంభించగా...తెలుగులో మాట్లాడండి అని వెంకయ్యనాయుడు అనగానే నవ్వేసి...ఆప్షన్ ఉందా? అని ఏచూరి అడిగారు. తరువాత సీతారాం ఏచూరి కొనసాగిస్తూ, వెంకయ్యనాయుడితో 40 ఏళ్ల సహజీవనం నాదని ఆయన తెలిపారు. సిద్ధంత పరంగా పోరాడాం, విభేదించాం, కలిసి పనిచేసాం, అనుభవాలు, అభిప్రాయాలు, ఆప్యాయతలు పంచుకున్నామని ఆయన అన్నారు. సభలో అంత తీవ్రంగా వ్యతిరేకిస్తారు కదా... బయట ఇలా ఎలా ఉండగలుగుతున్నారని తమ ఇద్దరూ కలిసి ఉన్న సందర్భంలో మీడియా అడిగిందని గుర్తుచేశారు. దానికి వెంకయ్యనాయుడు వారికి సమాధానమిస్తూ, నేను ఒక రైలు ఎక్కాను. రైలులో ప్రవేశించిన తరువాత సీతారాం ఏచూరి కనిపించాడు. వెంటనే రైలు దిగెయ్యాలా? అని ఎదురు ప్రశ్నించారు. దీంతో అంతా నవ్వేశారు. మా దారులు వేరైనా పని చేసింది మాత్రం ఒకే లక్ష్యం కోసం, ఒకే చోట అని ఆయన స్పష్టం చేశారు. వెంకయ్యనాయుడు గొప్ప స్థానంలో ఉన్నారని, ఆయన పక్షపాతం చూపించకుండా విధులు నిర్వర్తిస్తారని అభిప్రాయపడుతున్నానని ఆయన వెల్లడించారు.