చెన్నైతో బెంగళూరు ఢీ

SMTV Desk 2019-03-23 12:02:18  Bangalore, Chennai, IPL,

చెన్నై: దిగ్గజాల సమరానికి సర్వం సిద్ధమైంది. డిఫెండింగ్ ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్ల మధ్య శనివారం తొలి పోరు జరుగనుంది. ఐపిఎల్12 సీజన్‌లో భాగంగా శనివారం ఇరు జట్ల మధ్య తొలి మ్యాచ్ జరుగనుంది. చెన్నైలో చిదంబరం స్టేడియం మ్యాచ్‌కు వేదికగా నిలుస్తోంది. చెన్నైకు మహేంద్ర సింగ్ ధోని కెప్టెన్‌గా ఉండగా, బెంగళూరుకు విరాట్ కోహ్లి సారథిగా వ్యవహరించనున్నాడు. రెండు జట్లలోనూ దిగ్గజ ఆటగాళ్లకు కొదవలేదు. ఇక, ధోని, కోహ్లిల జట్ల మధ్య పోరు కావడంతో సర్వత్రా ఆసక్తి నెలకొంది. ప్రారంభ మ్యాచ్‌లోనే గెలిచి ట్రోఫీ వేటకు శ్రీకారం చుట్టాలని రెండు జట్లు తహతహలాడుతున్నాయి. నిషేధం తర్వాత అరంగేట్రం చేసిన తొలి సీజన్‌లోనే ట్రోఫీని గెలిచి చెన్నై ప్రకంపనలు సృష్టించింది. ధోని సారథ్యంలో చెన్నై ఇప్పటికే మూడు సార్లు ఐపిఎల్ ట్రోఫీని ముద్దాడింది. అయితే బెంగళూరు మాత్రం ఒక్కసారి కూడా ఐపిఎల్‌లో విజేతగా నిలువలేక పోయింది. దిగ్గజ ఆటగాళ్లు జట్టులో ఉన్నా ఐపిఎల్ ట్రోఫీ కోహ్లి సేనకు అందని ద్రాక్షగానే తయారైంది.

అయితే గతంతో పోల్చితే కోహ్లి ప్రస్తుతం కెప్టెన్సీలో ఆరితేరి పోయాడు. అతని సారథ్యంలో టీమిండియా వరుస విజయాలతో దూసుకుపోతున్న విషయం తెలిసిందే. ఈసారి ఐపిఎల్‌లో కూడా జట్టును ముందుండి నడిపించాలనే పట్టుదలతో కనిపిస్తున్నాడు. విరాట్ కోహ్లి భీకర ఫామ్‌లో ఉండడం జట్టుకు కలిసి వచ్చే అంశం. ఇక, డివిలియర్స్ రూపంలో అత్యంత విధ్వంసక బ్యాట్స్‌మన్ ఉండనే ఉన్నాడు. డివిలియర్స్ ఇప్పటికే విధ్వంసక బ్యాటింగ్‌తో ఐపిఎల్‌పై తనదైన ముద్ర వేశాడు. ఈ సీజన్‌లో కూడా బెంగళూరు ఆశలన్నీ డివిలియర్స్‌పైనే నిలిచాయనడంలో సందేహం లేదు. ఇప్పటికే అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన ఈ దక్షిణాఫ్రికా దిగ్గజం కేవలం లీగ్ క్రికెట్‌కే పరిమితమయ్యాడు. ఈసారి తన జట్టుకు ఎలాగైనా ట్రోఫీని అందించాలనే పట్టుదలతో ఉన్నాడు. మరోవైపు కోహ్లి కూడా ఇలాంటి లక్ష్యాన్నే పెట్టుకున్నాడు. ఈ ఇద్దరు చెలరేగి పోతే బెంగళూరుకు ఎదురు ఉండదు. కాగా, ఆరంభ మ్యాచ్‌లో ఇటు చెన్నై, అటు బెంగళూరు విజయమే లక్షంగా పెట్టుకున్నాయి. విజయంతో ట్రోఫీ వేటకు శ్రీకారం చుట్టాలనే పట్టుదలతో కనిపిస్తున్నాయి.