భారత ప్రజాస్వామ్యానికి నిదర్శనం : మోదీ

SMTV Desk 2017-08-11 12:42:37  VENKAYA NAYUDU, PRADHANI MODI, RAJYASABHA CHAIRMEN, VICE PRESIDENT

న్యూఢిల్లీ, ఆగస్ట్ 11 : ఉపరాష్ట్రపతిగా ప్రమాణస్వీకారం తర్వాత తొలిసారి రాజ్యసభకు వెంకయ్యనాయుడు హాజరయ్యారు. రాజ్యసభ చైర్మన్ హోదాలో కూర్చున్న వెంకయ్యకు శుభాకాంక్షల ప్రసంగం సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడుతూ.. రైతు బిడ్డగా ఆంధ్రప్రదేశ్ లోని మారుమూల ప్రాంతం నుంచి పార్టీ అధ్యక్షుడిగా, ఆ తర్వాత కేంద్రమంత్రిగా ఎన్నో బాధ్యతలు చేపట్టడమే కాకుండా తాజాగా ఇప్పుడు ఉపరాష్ట్రపతిగా ఎన్నిక కావడం ఆనందంగా ఉందన్నారు. దేశంలో వివిధ భాషలను అనర్గళంగా మాట్లాడగల వ్యక్తుల్లో వెంకయ్యనాయుడు ఒకరని, ఈ సభలోనే పెరిగి పెద్దవాడై ఇదే సభకు రావడం ఆనందంగా ఉందంటూ వ్యాఖ్యానించారు. సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న వ్యక్తి, గ్రామాల్లో రైతులకు స౦బంధి౦చిన ప్రతి విషయం ఆయనకు తెలుసంటూ ప్రధాని తెలిపారు. వెంకయ్య ప్రసంగం కేవలం మాటల గారడీ కాదు అవి హృదయాన్ని తాకేవిగా ఉంటాయంటూ ఆయన అభిప్రాయపడ్డారు. వెంకయ్యనాయుడు ఉపరాష్ట్రపతి కావడం భారత ప్రజాస్వామ్యానికి నిదర్శనం అంటూ ప్రశంసల వర్షం కుమ్మరించారు. ఈ ఉపరాష్ట్రపతి పదవికి ఆయన మరింత వన్నె తెస్తూ సభను సమర్దవంతంగా నడిపిస్తారని ప్రధాని నరేంద్ర మోదీ ఆశాభావం వ్యక్తం చేసారు.