పోలింగ్‌కు 48 గంటల ముందు సోషల్ మీడియాల్లో ప్రకటనలు నిలిపివేత

SMTV Desk 2019-03-22 11:59:41  election commission of india, central government, elections, social media, facebook, twitter, instagram

న్యూఢిల్లీ, మార్చ్ 21: రానున్న సార్వత్రిక ఎన్నికల సందర్భంగా ఎన్నికల సంఘం సోషల్ మీడియా సంస్థలతో చర్చించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తాము కూడా ఎన్నికల కోడ్‌ను పాటిస్తామని సోషల్‌మీడియా సంస్థలు స్వచ్ఛందంగా ముందుకొచ్చాయి. సార్వత్రిక ఎన్నికల పోలింగ్‌కు 48 గంటల ముందు తమ మాధ్యమాల్లో ఎన్నికల ప్రచారాన్ని నిలిపివేస్తామని ఫేస్‌బుక్‌, ట్విటర్‌, వాట్సాప్‌ వంటి సంస్థలు ప్రకటించాయి. దీని ప్రకారం.. పోలింగ్‌కు రెండు రోజుల ముందు ఫేస్‌బుక్‌, వాట్సాప్‌, ట్విటర్‌, గూగుల్‌, షేర్‌చాట్‌ లాంటి మాధ్యమాలు ఎన్నికల ప్రచారాన్ని అనుమతించవు. ఆన్‌లైన్‌ ప్రచారం కోసం ఇంటర్నెట్‌ ఆధారిత సంస్థలు నిబంధనలు పాటిస్తామని హామీలు ఇవ్వడం ఇదే తొలిసారి. దీనిపై ఎన్నికల ప్రధాన అధికారి సునిల్‌ అరోరా హర్షం వ్యక్తం చేశారు. సామాజిక మాధ్యమాలు ముందుకు రావడం మంచి పరిణామమని, అయితే నిబంధలను ఉల్లంఘించిన వారిపై సత్వర చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఇచ్చిన హామీలకు ఆయా సంస్థలు కట్టుబడి ఉండాలని కోరారు. ఈ నిబంధనల ప్రకారం.. కోడ్‌ ఉల్లంఘనలను సోషల్‌మీడియా సంస్థలు సంబంధిత నోడల్‌ అధికారికి ఫిర్యాదు చేస్తాయి.