అభిమానులకు సందేశం ఇచ్చిన రౌడీ హీరో

SMTV Desk 2019-03-21 15:54:40  Vijay devarakonda, NUmber plate

టాలీవుడ్‌లో ఒక్క సినిమాతోనే సెన్సేషనల్ స్టార్‌గా ఎదిగిన హీరో విజయ్ దేవరకొండ.. అతి తక్కువ సమయంలో విజయ్ ఎంతో మంది అభిమానులను తనవైపునకు తిప్పుకున్నాడు. వరుస హిట్లతో దూసుకుపోతున్న విజయ్.. ఇటీవల ‘రౌడీ’ పేరుతో వస్త్ర బ్రాండ్ ని మార్కెట్‌లోకి తీసుకొచ్చిన విషయం తెలిసిందే. ఈ బ్రాండ్ యూత్ ఎంతో నచ్చడంతో విజయ్ ని కూడా రౌడీ అనే పేరుతో పిలిస్తూ.. తమ అభిమానాన్ని చాటుకుంటున్నారు. అంతేకాదు ఆ పేరును తమ వాహనాలపై కొందరు రాసుకుంటుంటే.. ఇకొందరు ఏకంగా నెంబర్ ప్లేట్‌గా మార్చేస్తున్నారు.


వాహన తనిఖీల్లో భాగంగా ఇటీవల హైదరాబాద్ పోలీసులు రౌడీ నంబర్ ప్లేట్ ఉన్న ఓ వాహనాన్ని పట్టుకొని చలానా విధించారు. ఈ విషయాన్ని హైదరాబాద్‌ ట్రాఫిక్‌ పోలీసులు తమ అధికారిక ఫేస్‌బుక్‌ ఖాతాలో పోస్ట్‌ చేశారు. నెంబర్‌ ప్లేట్‌ లేకపోయినా, దానిపై రిజిస్టర్‌ నెంబర్‌ లేకపోయినా సీఎమ్‌వీ రూల్స్‌ను ఉల్లంఘించినట్లేనని పేర్కొన్నారు. ఈ పోస్ట్ చూసిన విజయ్ దేవరకొండ స్పందిస్తూ.. వారి తరపున తాను క్షమాపణ చెబుతున్నట్లు పేర్కొంటూ..అభిమానులకు సందేశం ఇచ్చాడు.

‘మీరూ నా కుటుంబంలో భాగమే. సమస్యల్లో పడొద్దని నా కుటుంబ సభ్యులకు చెబుతున్నాను. కొన్ని నిబంధనల్ని మనం తప్పకుండా పాటించాలి. అవి ఉన్నది మన కోసమే. నేనూ వాటిని ఫాలో అవుతాను. కుటుంబ సభ్యులు, స్నేహితులు, దేవుళ్లపై మీకున్న ప్రేమను మీ బైక్‌పై ఉన్న ఇంకేదైనా భాగంలో రాసి, చూపించండి. అనెంబర్‌ ప్లేట్‌ను కేవలం నెంబర్ల కోసం మాత్రమే ఉపయోగించండి’ అని విజయ్‌ దేవరకొండ పేర్కొన్నారు.