నాన్న చనిపోయిన బాధ కన్నా...పేపర్లు, టీవీల్లో వచ్చినవి చూస్తుంటేనే చాలా బాధేస్తుంది : వివేకా కూతురు

SMTV Desk 2019-03-21 12:57:09  ys vivekananda reddy, YSR Congress party, former Andhra Pradesh Chief Minister YS Rajashekhara Reddys, ys suneeta, press meet

పులివెందుల, మార్చ్ 20: వైఎస్‌ వివేకానందరెడ్డి హత్యపై కూతురు సునీత పులివెందులలో తాజాగా మీడియాతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ... గత ఐదు రోజులుగా ప్రసార మాధ్యమాల్లో వస్తున్న రకరకాల వార్తలను చూసి బాధగా ఉందని, సిట్‌ నివేదిక వచ్చే వరకూ మీడియా, రాజకీయ నాయకులు సంయమనం పాటించాలని అభ్యర్థించారు. మా నాన్నకు నేనంటే చాలా ఇష్టం. ఆయనకు ముందు ప్రజాసేవ, తర్వాతే కుటుంబం. కొంత కాలంగా మా అమ్మకు అనారోగ్యంగా ఉంది. కాబట్టి నా దగ్గరే ఉంటోంది. చాలా కాలంగా నాన్న ఒక్కరే పులివెందులలో ఉంటున్నారు. నాన్న చనిపోవడంతో చాలా బాధ కలిగింది కానీ పేపర్లు, టీవీల్లో వచ్చినవి చూస్తుంటే ఇంకా ఎక్కువ విచారం కలుగుతోంది. మానాన్న ఎంతో హుందాగా బతికారు. చనిపోయిన వారి గురించి చెడుగా మాట్లాడకూడదని అంటుంటాం. ఈ విషయంలో కూడా ఇలా వ్యవహరించడం సరికాదు. మీడియాలో వస్తున్న వార్తలు దర్యాప్తుపై ప్రభావం చూపుతాయని అనిపించడం లేదా? ఈ కిరాతకమైన పని చేసిన వారిని గుర్తించాలి కదా! వారికి శిక్ష పడాలి. సిట్‌ నిరంతరం ఈ ఘటనపై పని చేస్తోంది. ఈ బృందం నుంచి ఏ సమాధానం రాకుండా ఏది పడితే అది రాసుకుంటూ పోతే సరైన విచారణ ఎలా జరుగుతుంది. చాలా నెగటివ్‌ వార్తలు వ్యాపిస్తున్నాయి. ఇది ఎంత మాత్రం సబబు కాదు. జగన్‌ సీఎం కావాలని మా నాన్న బాగా కష్ట పడ్డారు.