జాతీయ పార్టీని స్థాపిస్తా!

SMTV Desk 2019-03-19 12:05:06  kcr, karimnagar, ktr, trs, loksabha elections, bjp

కరీంనగర్, మార్చ్ 18: రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ పార్లమెంట్ ఎన్నికల్లో భాగంగా తొలిసారిగా కరీంనగర్ వేదికగా నిర్వహించిన టీఆర్‌ఎస్ బహిరంగ సభ విజయవంతమైంది. పట్టణంలోని స్పోర్ట్స్ స్కూల్ మైదానంలో జరిగిన సభకు సుమారు రెండు లక్షల మందికి పైగా ప్రజలు స్వచ్ఛందంగా తరలి వచ్చారు. ఈ భారీ బహిరంగ సభకు ఆంధ్రప్రదేశ్ నుంచి పలువురు సీఎం కేసీఆర్ అభిమానులు తరలివచ్చారు. కలిసొచ్చిన గడ్డ.. పోరాటాల గడ్డ అయిన కరీంనగర్‌లో సీఎం కేసీఆర్‌ సంచలన ప్రకటన చేసారు. దేశానికి దశ దిశను చూపేందుకు అవసరమైతే జాతీయ పార్టీని స్థాపిస్తానని ప్రకటించారు. కాంగ్రెస్-బీజేపీ ముక్త్ భారత్ కావాలని పిలుపునిచ్చిన కేసీఆర్.. మీ బిడ్డగా కరీంనగర్ దీవెనతోని ఫెడరల్ ఫ్రంట్ రాజకీయాల్ని బలోపేతం చేసి ఈ దేశాన్ని దుర్మార్గుల నుంచి విముక్తి చేసి, అద్భుతమైన భారతదేశ నిర్మాణానికి ముందడుగు వేస్తానని చెప్పారు. ఇప్పటివరకు అధికారంలో ఉన్న కాంగ్రెస్, బీజేపీ ప్రభుత్వాలు దేశానికి ఏమీ చేయలేదని, అభివృద్ధిలో దేశం వెనుకబడి ఉన్నదని చెప్తూ.. ఉదాహరణలతో సహా వివరించారు. దేశం బాగుపడాలంటే, అంతర్జాతీయ స్థాయిలో దీటుగా తలెత్తుకొని ముందుకు పోవాలంటే కాంగ్రెస్, బీజేపీలను తరిమికొట్టాలన్నారు సీఎం కేసీఆర్. అప్పుడే దేశంలో ప్రత్యామ్నాయ సమాఖ్య రాజకీయాలు వస్తాయన్నారు. న్యాయ, శాసనవ్యవస్థలో, ప్రభుత్వాల నిర్మాణంలో సంస్కరణలు రావాలని.. ఇది జరగాలంటే దేశంలో ప్రాంతీయ పార్టీలు శాసించే, రాష్ట్రాలు హక్కులు కలిగి ఉండే ఫెడరల్ ఫ్రంట్ ప్రభుత్వం రావాలని స్పష్టం చేసారు సీఎం కేసీఆర్. ఎన్నికల తర్వాత సంభవించే పరిణామాలు చూసి.. అవసరమైతే జాతీయపార్టీని స్థాపించి దేశం మొత్తం ఒకటి చేస్తానని ప్రకటించారు సీఎ కేసీఆర్. కాంగ్రెస్-బీజేపీ ముక్త్ భారత్ కావాలని.. ఈ రెండు పార్టీలు ఏం చేయలేదన్నారు. ఫెడరల్ ఫ్రంట్ రాజకీయాల్ని బలోపేతం చేసి ఈ దేశాన్ని దుర్మార్గుల నుంచి విముక్తి చేసి, అద్భుతమైన భారతదేశ నిర్మాణానికి ముందడుగు వేస్తానని స్పష్టం చేసారు. 16 సీట్లు ఇస్తే ఏం చేస్తవు కేసీఆరూ.. అంటున్నరు! కేవలం రెండే రెండు ఎంపీలతో తెలంగాణను ఎట్ల సాధించినమో.. 16 మంది ఎంపీలకు తోడు.. 160 మందిని జమ చేసి.. దేశ రాజకీయాలకు ఊపిరిపోస్తానన్నారు. బీజేపీ అధ్యక్షుడు అమిత్‌షా తెలంగాణకు వచ్చినపుడల్లా ఇన్ని డబ్బులిచ్చాం.. అన్ని డబ్బులిచ్చాం అంటూ అబద్దాలు చెప్తాడని సీఎం మండిపడ్డారు. తెలంగాణ నుంచి వివిధ పన్నుల రూపంలో కేంద్ర ఖజానాకు సమకూరేది రూ.50వేల కోట్లయితే.. కేంద్రం నుంచి మనకు వచ్చేవి రూ.24వేల కోట్లేనన్నారు. అమిత్‌షా అడ్డంపొడుగు మాట్లాడితే నిజం కాదని స్పష్టం చేసారు. దేశంలో ఏ ఒక్క కాంగ్రెస్, బీజేపీ పాలిత రాష్ర్టాల్లోనైనా రైతాంగానికి 24 గంటల కరంటు ఇవ్వడం లేదని చెప్పారు సీఎం కేసీఆర్. నరేంద్రమోడీ, రాహుల్‌గాంధీలు దమ్ముంటే సమాధానం చెప్పాలన్నారు. రైతుబీమా పథకాన్ని ఈ దేశంలో ఎవరూ ఆలోచించలేదని.. ఎవరైనా రైతు దురదృష్టవశాత్తు చనిపోతే.. పదిరోజుల్లో ఠంచన్‌గా వాళ్ల బ్యాంకు ఖాతాలో రూ.5 లక్షల జమ అయితున్నాయన్నారు. ఇవ్వాల రైతుబంధు పథకాన్ని కేంద్రంతో సహా అన్ని రాష్ర్టాలు నకలు కొడుతున్నయన్నారు. దేశంలో నరేంద్రమోడీ, రాహుల్‌గాంధీలే అసలు దొంగలన్నారు. దేశంలో 70వేల టీఎంసీల నీళ్లుంటే వ్యవసాయ అనుకూల భూమి 40కోట్ల ఎకరాలేనన్నారు. ఇంచు లేకుండా దేశమంతా నీళ్లు పారితే 40 వేల టీఎంసీలు సరిపోతాయన్నారు. ఇక కృష్ణా జలాల పంచాయితీ చెప్పడానికి బ్రిజేశ్ ట్రిబ్యునల్ 2004లో ఏర్పాటైనా.. ఇప్పటికీ తీర్పు రాలేదన్నారు. ఇక పాకిస్థాన్‌ విషయానికొస్తే.. దాన్ని కంట్రోల్ చేయరు.. రక్షణ వ్యవహారాలు పట్టించుకోరని సీఎం కేసీఆర్ మండిపడ్డారు. అంతర్జాతీయ వ్యవహారాలు చక్కపెట్టరని చెప్పారు. దేశంలో కరెంట్ 3.44 లక్షల మెగావాట్లు ఉన్నది… కానీ ఇప్పటివరకు అత్యధికంగా వాడిందే లక్షా 80వేల మెగావాట్లని సీఎం గుర్తు చేశారు. లక్షల మెగావాట్ల ఉత్పత్తి ఉన్నా.. వాడే తెలివిలేదని…. ఛత్తీస్‌గఢ్‌లో 37వేల మెగావాట్ల విద్యుత్ ప్లాంట్లు మూతపడ్డయని చెప్పారు. ఇంత దిక్కుమాలిన విధానాలు ఏ దేశంలోనైనా ఉంటయా అని ప్రశ్నించారు సీఎం కేసీఆర్. ఈ విధానాలు మారాలి. మారి తీరాలి! అని స్పష్టం చేసారు.