టీడీపీ కనుసన్నులో జనసేన

SMTV Desk 2019-03-18 13:57:25  tdp, Janasena,

అమరావతి, మార్చ్ 18: టీడీపీతో తమకు ఎలాంటి పొత్తూ లేదని పవన్ చెప్పినా జనసేన, టీడీపీల నడుమ రహస్య స్నేహం నడుస్తోందని వైఎస్సాఆర్ కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తోంది. పైగా ఇటీవల జరిగిన కొన్ని పరిణామాల్ని ఆ ఆరోపణలకు ఆపాదిస్తూ తమ వాదనకు బలం చేకూర్చుకుంటున్నాయి. సీబీఐ మాజీ జేడీ లక్ష్మీ నారాయణ తాజాగా జనసేనలో చేరిన సంగతి తెలిసిందే. ఈ చేరిక వెనుక చంద్రబాబు ఉన్నారని వైకాపా ఆరోపణ.

అంతేకాదు పవన్ ఇటీవలే లక్నో వెళ్లి మాయావతి సమక్షంలో బిఎస్పీతో పొత్తు కుదుర్చుకుని వచ్చారు. రాబోయే ఎన్నికల్లో ఆ పార్టీకి 21 అసెంబ్లీ, 3 లోక్ సభ స్థానాల్ని కేటాయించారు. మొదటిసారి లక్నో వెళ్ళినప్పుడు మాయావతిని కలవలేకపోయిన పవన్ ఈసారి నేరుగా వెళ్లి కలిసే అవకాశం చంద్రబాబే కల్పించారని, ఆయన సూచన మేరకే పొత్తు కుదురిందని అంటున్నారు. ఈ అంశాల్ని జగన్ మీడియా పెద్ద ఎత్తున ప్రచారం ప్రచారం చేస్తోంది.

ఇలా పవన్ కళ్యాణ్ ను మూడో ప్రత్యాన్మాయం చేసి తమకు పడాల్సిన ప్రభుత్వ వ్యతిరేక ఓట్లను జనసేన ఖాతాలోకి వెళ్లేలా చేయాలనేదే ఈ చీకటి ఒప్పందం లక్ష్యమని, దీనికి బదులుగా పవన్ తో పాటు ఇంకొందరు జనసేన, వారి మిత్ర పక్షాల్లోని ముఖ్య నేతలు పోటీ చేయనున్న స్థానాల్లో బాబు టీడీపీ తరపున బలహీన అభ్యర్థుల్ని నిలబెడుతున్నారని ఆరోపిస్తున్నారు. ఈ ఆరోపణల్ని గనుక చంద్రబాబు బలంగా ఖండించకుంటే జగన్ ఆరోపణలే నిజమనుకుని జనంలో టీడీపీ పట్ల నెగెటివిటీ పెరిగే ప్రమాదముంది.